సేవ చేయడమే జిఎంఆర్ఎం ట్రస్ట్ సంకల్పం..

సేవ చేయడమే జిఎంఆర్ఎం ట్రస్ట్ సంకల్పం..
  • అవసరం గుర్తించి యువతకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నాం.. 
  • రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతాం..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:సేవ చేయడమే జిఎంఆర్ఎం ట్రస్టు సంకల్పమని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం మండలపరిధిలోని యువతి, యువకులకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ, అర్హులకు లైసెన్స్ ఇప్పించేందుకు ధరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిఎంఆర్ఎం ట్రస్టు నిర్వాహక కార్యదర్శి గండ్ర గౌతంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జిల్లా జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతిలు హాజరై మాట్లాడుతూ సమాజంలో అనేకమంది యువతి, యువకులు డ్రైవింగ్ లైసెన్స్ లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి అవసరాల కనుగుణంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో యువతీ యువకులకు డ్రైవింగ్ శిక్షణ లైసెన్సులు  ఇప్పించేందుకు జిఎంఆర్ఎం ట్రస్టు ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రతి మండలంలో ట్రస్టు నిర్వహించే కార్యక్రమానికి వేలాదిమంది యువతి, యువకులు తరలివస్తున్నారని, వచ్చిన వారందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం జరుగుతుందన్నారు.

గండ్ర మోహన్ రెడ్డి పేరుమీద జిఎంఆర్ఎం ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ట్రస్ట్ ద్వారా ఒక్క డ్రైవింగ్ శిక్షణ తరగతులే కాకుండా యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఉచితంగా క్రీడలను నిర్వహించడం, ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అందించడం జరిగిందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్ ప్రకటించిన పరిస్థితులలో కార్పొరేట్ స్థాయి తరహాలో ఉచితంగా నాణ్యమైన విద్య కోచింగ్, భోజన సదుపాయం కల్పించి ట్రస్టు విశేష సేవలను అందించినట్లు వివరించారు. గత 16నెలల నుంచి జిఎంఆర్ఎం ట్రస్టు ఆధ్వర్యంలో భూపాలపల్లి ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని, తొందరలో చిట్యాల ప్రభుత్వ దవాఖానలో కూడా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తామని వారు హామి ఇచ్చారు. సామాజిక సేవా కార్యాక్రమాలతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయిస్తూ తాము ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనేక సేవా కార్పక్రమాలతో సమాజ హితం కోసం పాటుపడుతున్నప్పటికీ, దీనిని కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిని ప్రజలు తిప్పి కొట్టాలని రానున్న రోజుల్లో ప్రజాపాలకులకు పట్టం కట్టాలని చెప్పారు. కొన్ని పార్టీల నాయకులు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ముందుకు వస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద, జడ్పిటిసి గొర్రెసాగర్, సర్పంచ్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.