24గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి

24గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి

 పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గడిచిన 24 గంటల్లో ఏడుగురు చిన్నారులు మరణించారు. వీరంతా శ్యాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించినట్లు సీనియర్ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో గడిచిన వారంరోజుల్లో అడెనోవైరస్ వల్ల 12 మంది చిన్నారులు మరణించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం ఈ మరణాలను ఆడెనోవైరస్ కారణంగా సంభవించినట్లు పేర్కొనలేదు. ఈ సీజన్‌లో తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణమని పేర్కొంది. అడనోవైరస్ ఎక్కువగా -2 ఏళ్లలోపు పిల్లలకు సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లల్లో అడెనోవైరస్ సాధారణంగా శ్వాసకోశ, ప్రేగులలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని వైద్యులు తెలిపారు.

గడిచిన 24 గంటల్లో కోల్‌కతాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐదుగురు, బంకురా సమ్మిలానీ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు మరణించారు. కోల్‌కతాలోని బీసీ రాయ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో బుధవారం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో మరణించిన ఇద్దరు పిల్లలకు జ్వరం, శ్వాస ఆడపకపోవటం వంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. హౌరాకు చెందిన ఒకరి వయస్సు 22 రోజులు, చుంచురాకకు చెందిన మరొక చిన్నారికి ఏడు నెలలు. అయితే, అడెనోవైరస్ లక్షణాలు ఉన్న వారి నమూనాలను పరీక్షకోసం పంపించామని, ఫలితాల కోసం వేచి చూస్తున్నామని వైద్య అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్న అడెనోవైరస్ అంటు వ్యాధి అని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. ప్రస్తుత పరిస్థితి కాలానుగుణ పెరుగుదల తప్ప మరొకటి కాదని ప్రభుత్వం తెలిపింది. అడెనోవైరస్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల సంఖ్య ఇప్పటికే తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం వెల్లడించింది.