పోలీసులు  దెబ్బలకు అనారోగ్యం పాలైన వ్యక్తి మృతి

పోలీసులు  దెబ్బలకు అనారోగ్యం పాలైన వ్యక్తి మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్: మహిళ మెడలో నుంచి  బంగారం దొంగతనం చేశాడనే అనుమానంతో  పోలీసు దెబ్బలకు అనారోగ్యంపాలైన వ్యక్తి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెదక్ పట్టణంలోని అరబ్ గల్లిలో గత నెల 29వ తేదీన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేశాడు. ఈ నేపథ్యంలో మెదక్ పోలీసులు సీసీ కెమెరా పుటేజి ఆధారంగా హైదరాబాద్ లో పని చేసుకునే స్థానిక పిట్లంబేస్ వీధికి చెందిన మహమ్మద్ ఖాదీర్ ను పట్టుకెళ్ళి ఎంక్వైరీ పేరుతో  కొట్టారు. ఈ నెల 3వ తేదీన పోలీసులు అతన్ని  తహశీల్దార్ ముందు బైండోవర్ చేసి వదిలేశారు.

ఇంటికి వెళ్ళిన అతను తీవ్ర అనారోగ్యానికి గురికాగ కుటుంబ సభ్యులు అతన్ని 8వ తేదీన మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. దెబ్బలకు కిడ్నీలు దెబ్బతిన్నాయని డాక్టర్ లు చెప్పడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఖాదీర్ ఖాన్ మృతి చెందాడు. ఎలాంటి తప్పు చేయకున్నా హైదరాబాద్ లో లేబర్ పనిచేసుకునే ఖాదిర్ ను పోలీసులు అకారణంగా పట్టుకువచ్చి చితకబాదడంతో చనిపోయాడని పట్టణ మైనార్టీ నాయకులు ఆరోపించారు. ఖాదీర్ మృతికి కారకులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ పోలీస్ స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు ఇచ్చారు.