బహుముఖ ప్రజ్ఞాశాలి సిద్ధప్ప వరకవి

బహుముఖ ప్రజ్ఞాశాలి సిద్ధప్ప వరకవి
  • తెలంగాణ వేమనగా గుర్తింపు
  • తొలి సమాజకవిగా రాణింపు 
  • ఇంటర్ ద్వితీయంలో సిద్ధప్ప పాఠ్యాంశం
  • గుండారెడ్డి పల్లె నుండి కర్ణాటక,మహారాష్ట్ర పల్లెల దాక పాకిన తత్వాలు
  • 120 వ జయంతి సందర్భంగా 'ముద్ర ప్రత్యేక కథనం'

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట:అతను మట్టి  బెడ్డల మధ్య పుట్టిన బిడ్డ... పేదరికపు అంచుల్లో ఉన్న కుటుంబానికి దివ్యాంగత్వంతో జనించిన కొడుకు అతను అయితేనేమ్ సరస్వతీ దేవి కటాక్షం పొందిన వరపుత్రుడతను. చదివింది తక్కువే అయినా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తిని గడించారు. తెలంగాణ సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. తెలంగాణ వేమనగా వాసికి ఎక్కారు. బ్రిటిష్ నిజాం పాలకుల హయాంలోనూ తొలి సమాజకవిగా వెలుగొందారు ఆదివారము నాడు అనంతవరం సిద్ధప్ప వరకవి 120 వ జయంతి జరుగునుంది ఈ సందర్భంగా ముద్ర ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం.


“వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప- కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప”.. అనే మకుటంతో సామాజిక అంశాలు ఇతివృత్తంగా అనేక పద్యాలు రచియించి సమాజాన్ని మేల్కొల్పిన కవి అనంతవరం సిద్దప్ప.. ఇతనిని వరకవి రాజయోగి అని కూడా సంబోధిస్తారు.నిన్నటి కరీంనగర్ జిల్లా నేటి సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం  గుండారెడ్డిపల్లి  గ్రామానికి చెందిన  అనంతవరం లక్ష్మి- పెదరాజయ్య దంపతుల ముద్దు బిడ్డ నే ఈ సిద్ధప్ప.  1903 వ సంవత్సరం జూలై 9వ తేదీన జన్మించిన సిద్దప్ప ఆ కాలంలో 7వ తరగతి వరకు చదివారు.శాలివాహన కుల దంపతుల ఇంట్లో జన్మించిన సిద్ధప్ప చిన్నతనం నుండే సాహిత్యం పట్ల మక్కువ కనబరిచారు. సరస్వతి దేవి కటాక్షంతో 40 వరకు గ్రంథాలను రచించారు. తెలంగాణ సాహిత్య చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

పండిత,పామర జనులు సైతం అలవోకగా పాడుకునే విధంగా రచనలు చేసిన సిద్దప్ప పద్యాల్ని నేటికి ప్రతి భజన మండపాళ్లలో పాడుతుంటారు. ‘తెలంగాణ తొలి సమాజ కవి’గా, ’తెలంగాణ వేమన’గా వెలుగొంది ‘గోల్కొండ కవి’గా “గోల్కొండ కవుల సంచిక”లో ఒకరిగా వెలుగొందుతున్నారు.తెలుగు సాహిత్య చరిత్రలో శాలివాహన కులం నుండి మొల్ల తర్వాత సిద్దప్ప అంతటి ప్రాచుర్యం పొందారు. సాహిత్యంతో పాటు జ్యోతిషం,వాస్తు, ఆయుర్వేదం,యోగ విద్యల్లో ప్రావీణ్యం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో భక్తులను, అభిమానులను చూరగొన్నారు.సిద్దప్ప జీవితం,సాహిత్యంపై పలు సదస్సులు జరిగాయి. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. తెలంగాణ పాఠ్యాంశాల్లో తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలో తన పద్యాల్ని కూడా పరిచయం చేశారు. వీరి రచనల్లో “సిద్దప్ప వరకవి జ్ఞాన బోధిని” నాలుగు భాగాలు విస్తృత ప్రజాధరణ పొందింది.తన రచనల ద్వారా సమాజ మూఢత్వాన్ని ముక్కుసూటిగా ఖండించిన సిద్దప్ప 1984 వ సంవత్సరం మార్చి 23న తనువు చాలించారు.


ఆయన జ్ఞాపకార్థం ప్రతియేటా కార్తీక పౌర్ణమి రోజున వేలాది భక్తుల మధ్య ఆయన కుటుంబ సభ్యులు గుండారెడ్డిపల్లిలోని ఆశ్రమంలో గల సమాధి విగ్రహం వద్ద గురుపూజోత్సవం నిర్వహించడం ఆనవాయితిగా వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరవాత సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లికి చెందిన  సిద్దప్ప వరకవిని గోల్కోండ కవి గా గుర్తించడం శుభపరిణామం. 

ఇంటర్ ద్వితీయంలో సిద్ధప్ప కవి పాఠ్యాంశం 

సిద్ధప్ప వరకవి రాసిన పద్యాలను "జ్ఞానబోధ" పేరుతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగులో పాఠ్యాంశంగా ప్రచురించారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ముద్రించిన  తొమ్మిదో తరగతి తెలుగువాచకంలో సిద్దప్ప వరకవి రాసిన పద్యాలను ప్రచురించి తగిన ప్రాధాన్యం కల్పించారు. సిద్ధప్ప వరకవి రచించిన బాగా ప్రాచుర్యంలోనికి వచ్చిన" సిద్దప్ప వరకవి జ్ఞాన బోధిని" నాలుగు భాగాలలోని రెండు పద్యాలను ప్రచురించారు.