క్రీడల ప్రోత్సహానికి సమాజం ముందుకు రావాలి

క్రీడల ప్రోత్సహానికి సమాజం ముందుకు రావాలి
  • క్రీడాకారులకు, ప్రైవేటు రంగానికి మధ్య ‘సాట్స్‌’ వారధిలా పనిచేయాలి
  • క్రీడాకారులకు ఉపాధి లభించేలా ‘సాట్స్‌’ కృషి చేయాలి
  • ఆరోగ్యవంతమైన సమాజన నిర్మాణానికి క్రీడలే ప్రధానం: ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌
  • ‘సాట్స్‌’ కార్యక్రమాలను అభినందించిన ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌

హైదరాబాద్ ముద్ర న్యూస్: క్రీడాకారులను సమాజం గుర్తించి ప్రోత్సహించినపుడు క్రీడల్లో అభివృద్ధిసాధ్యమవుతుందని అన్ని వర్గాలు క్రీడా రంగాన్నిప్రోత్సహించినప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలంగాణా రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం నాడు సాట్స్‌ కార్యాలయాన్ని సందర్శించిన బోయినపల్లి వినోద్‌ కుమార్‌ సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌తోసమావేశమయ్యారు. సాట్స్‌ ఛైర్మన్‌  ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ను ఆత్మీయంగాసత్కరించారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ, క్రీడాభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వారు క్రీడల్ని ఆదరించడం, ప్రోత్సహించడం వల్ల మరింత మందివిద్యార్థులు, యువకులు, క్రీడల పట్ల ఆసక్తి చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌  చొరవతో రాష్ట్రంలోని ప్రతి పల్లెలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు అయ్యాయని, వీటిని సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని, ప్రైవేటు సంస్థలు కూడా క్రీడాభివృద్ధిలో ముందుకు రావాలని ఆయన కోరారు. క్రీడాకారులకు వివిధ స్థాయిలలో ప్రైవేటు సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడానికి సాట్స్‌ వారధిలాగా పని చేయాలని ఆయన సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజానికి క్రీడలే ప్రధానమని, క్రీడా రంగాన్ని పటిష్టం చేయడం ద్వారా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటామని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం రెండు నెలల్లో వివిధ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించి, మంచి ఆలోచనలతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తున్న డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ను ఆయన అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి తెలంగాణా క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించే విధంగా ‘సాట్స్‌’ కార్యకలాపాలు, ప్రణాళికలు ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రణాళిక సంఘం తరపున సహకారం ఉండాలని ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు.