టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌పై సీబీఐ విచారణ జరిపించాలి

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌పై సీబీఐ విచారణ జరిపించాలి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై కేంద్రహోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. నిరుద్యోగులు చాలా కష్టపడి కోచింగ్‌ తీసుకుంటున్నారని.. తల్లిదండ్రులు వ్యయప్రయాసలతో చదివిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులతో ముడిపడి ఉన్న సమస్య ఇది అని చెప్పారు. పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా చేయాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 వేలు ఖాళీలు కాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు.  వడగళ్ల వానతో రైతులు నష్టపోతే ఎకరాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.10వేలు ఎలా సరిపోతుందని కోమటిరెడ్డి ప్రశ్నించారు. భువనగిరిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు 4వేల మంది దరఖాస్తు చేసుకుంటే 2300 మందిని అనర్హులుగా తేల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం తీసుకున్న నిర్ణయంపై దేశం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు. దేశం కుల, మతాలకు అతీతంగా కలిసి ఉండాలని హాథ్‌సే హాథ్‌ జోడో యాత్రను రాహుల్‌ చేపట్టారని.. యాత్రలో ఎక్కడా కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన కోరలేదని గుర్తుచేశారు. రాహుల్‌కు అందరూ సంఘీభావం తెలపాలని కోమటిరెడ్డి కోరారు.