ఆడబిడ్డల క్షేమమే సర్కారు ధ్యేయం మహిళ బాగుంటేనే ఇంటికి ఆరోగ్యం..

ఆడబిడ్డల క్షేమమే సర్కారు ధ్యేయం మహిళ బాగుంటేనే ఇంటికి ఆరోగ్యం..
  • ఆరోగ్య మహిళ’తో వ్యాధులన్నింటికీ పరిష్కారం
  • పైసా ఖర్చు లేకుండా 8రకాల వైద్య పరీక్షల నిర్వహణ.
  • రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు  సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతిరాథోడ్..

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: రాష్ట్రంలో 50 శాతం మంది మహిళలు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోవడానికి ఇష్టం లేక, చికిత్స కోసం వెళ్లే తీరిక లేక వ్యాధుల గురించి వారు పట్టించుకోవడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని, ఆడబిడ్డల ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశుసంక్షేమశాఖలమంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో మంత్రి సత్యవతిరాథోడ్ మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంబించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళ బాగుంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుందని, ఆరోగ్య మహిళ’ ద్వారా ఏర్పాటు చేసిన దవాఖానల్లో అటెండర్‌ నుంచి డాక్టర్‌ వరకు అందరూ మహిళలే ఉంటారని తెలిపారు.

నిర్భయంగా వెళ్లి తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు. మహిళలకు ఆరోగ్యమహిళ ద్వారా 8 రకాల పరీక్షలు నిర్వహిస్తారని, 80 శాతం మహిళలకు ఇక్కడే ఉచిత పరీక్షలు, మందులు, సూచనలు, ఆరోగ్య సలహాలు లభిస్తాయని, ఇక్కడ పరిష్కారంకాని సమస్యలను జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలకు రెఫర్‌ చేస్తారని, అక్కడ మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌, ప్రత్యేక వార్డు ఉంటుందని వివరించారు. చికిత్స చేయించుకునే స్థోమత లేని మహిళలు తమ ఇబ్బందులు చెప్పుకోలేక వ్యాధులు ముదిరిపోయే పరిస్థితికి తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మహిళలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ మహిళల కోసం ఇచ్చిన  కానుక‘ ఆరోగ్య మహిళ అన్నారు. 24 గంట‌ల్లో 19 కాన్పులు చేసి అందులో 15మందికి నార్మల్‌ డెలివరీలు చేసి మ‌హ‌బూబాబాద్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి రికార్డు సాధించిందన్నారు. పేషంట్లతో పాటు వారి  సహాయకులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రిలో ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేసి  అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.  ప్రత్యేక చొరవ తీసుకుంటానని మంత్రి సత్యవతిరాథోడ్ హామీ ఇచ్చారు. అనంతరం రేడియాలజీ హబ్ ను మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో పలువురు పేషెంట్లను మంత్రి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి వైద్యులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాతోడ్ తో పాటు జిల్లా జెడ్పీ చైర్ పర్సన్  అంగోత్ బిందు, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, జిల్లా కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్,డియంఅండ్ హెచ్ఓ హరీష్ రాజ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.