పోతే పోనీ ఉద్యోగం!

పోతే పోనీ ఉద్యోగం!

కేసముద్రంలో జేపీఎస్ ల నిల్ జాయినింగ్
కేసముద్రం, ముద్ర: శనివారం సాయంత్రం లోగా సమ్మె విరమించి విధులకు హాజరుకానిపక్షంలో ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఒక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శి కూడా విధుల్లో చేరలేదు. సెకండ్ సాటర్ డే ప్రభుత్వ సెలవు అయినప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరడానికి అవకాశం కల్పిస్తూ ఎంపీడీవో కార్యాలయాన్ని తెరిచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. సాయంత్రం 4:30 గంటల వరకు ఒక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శి కూడా జాయిన్ కాలేదని ఎంపీడీవో రవీందర్ రావు తెలిపారు. పూర్వపు కేసముద్రం మండలంలో 40 గ్రామపంచాయతీలో ఉండగా, ఒక అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి, 27 మంది జేపీఎస్ లు ఉన్నారు.

ఇందులో బిచ్చా నాయక్ తండా జెపిఎస్ నాలుగు రోజుల క్రితం విధుల్లో చేరగా, క్యాంపు తండా జేపిఎస్ రెండు రోజుల క్రితం విధుల్లో చేరి మళ్ళీ మరుసటి రోజు మనసు మార్చుకుని సమ్మెకు జై కొట్టారు. మొత్తంగా 27 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో ఒక్కరు కూడా రీజైనింగ్ కాకపోవడం గమనార్హం. పోతే పోయింది బానిస ఉద్యోగం.. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే నెరవేర్చకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించడం ఏ మేరకు సమంజసమని పలువురు జేపీఎస్ లు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా ఖానాపురం మండల రంగాపురం జేపిఎస్ బైరి సోనీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మరణించగా, శనివారం నర్సంపేటలో నిర్వహించిన ఆమె అంత్యక్రియలకు జెపిఎస్ లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.