గ్రీష్మ తాపం తట్టుకోలేం? మండుటెండలో బడిబాట!

గ్రీష్మ తాపం తట్టుకోలేం? మండుటెండలో బడిబాట!

కేసముద్రం, ముద్ర: మండుతున్న ఎండల్లో విద్యార్థుల కోసం పంతుళ్లు బడిబాట కార్యక్రమంలో ఇంటింటి ప్రచారం చేయడానికి నానా గోస పడుతున్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడానికి ఈనెల 3 నుంచి 9 వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు బడిబాట కార్యక్రమంలో ఇంటింటి సర్వే నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని విస్తృతంగా పాఠశాల ఆవాస ప్రాంతాల్లో ప్రచారం చేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులను ఆదేశించింది. విద్యా కమిటీ ప్రతినిధులతో పాటు ఉపాధ్యాయులు శనివారం ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లోని వివిధ గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఉదయం ఏడు గంటలకే సూర్య భగవానుడు భగభగ మండుతూ తన ప్రకోపాన్ని ప్రదర్శిస్తుండడంతో బడిబాటలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఎండలకు తాళలేక తలడిల్లిపోయారు. తొలిరోజు ఉపాధ్యాయులతో పాటు వివిధ ఆవాస ప్రాంతాల్లో ఇప్పటికే విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు బడిబాట కార్యక్రమంలో పాల్గొనగా, ఎండ వేడినీ తట్టుకోలేక ప్రచారం కోసం ప్రభుత్వం పంపిన బ్యానర్లను కప్పుకొని ప్రచారంలో పాల్గొనడం ఎండ తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభించడానికి విద్యాశాఖ నిర్ణయించగా, వేసవి తీవ్రత వల్ల బడిబాట కార్యక్రమాన్ని కూడా వారం రోజులపాటు వాయిదా వేయాలని ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.