తినేధాన్యాన్ని తగలబెట్టొద్దు!

తినేధాన్యాన్ని తగలబెట్టొద్దు!
  • రెండు రెట్లు పెరిగిన దిగుమతి
  • సీఎం కేసీఆర్ కృషితో అన్నపూర్ణగా తెలంగాణ
  • మంత్రి సత్యవతి రాథోడ్

కేసముద్రం/గూడూర్, ముద్ర: తినే ధాన్యాన్ని తగలబెట్టొద్దని, సీఎం కేసీఆర్ కృషి వల్ల సాగునీటి వనరులతో పంట దిగుబడి రెండింతలు పెరిగిందని, రైతులు కాస్త ఓపికగా ఉంటే కొనుగోలు పూర్తి చేసి వెంటనే డబ్బులు ఖాతాలో జమ చేస్తామని, అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పదివేల చొప్పున మహబూబాబాద్ జిల్లాలో 11.65 కోట్లు పంట నష్టపరిహారం అందజేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10వేల చొప్పున 11.65 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతులు ధాన్యం కొనుగోళ్లలో ఓపిక పట్టాలని కోరారు. తినే ధాన్యాన్ని తగులో పెట్టరాదని నిరుపేదలకు ఇవ్వాలన్నారు. గతంలో రెండు లక్షల ఎకరాలలో పండే దాన్యం ఇప్పుడు 4 లక్షలకు పైగా పండిస్తున్నామని రెండింతలు పెరిగినట్లు వివరించారు.

సీఎం కేసీఆర్ ముందుచూపుతో సాగునీటి రంగాలను అభివృద్ధి చేయడం, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల సాగు విస్తీర్ణం పెరిగి నేడు దేశంలో తెలంగాణ అన్నపూర్ణగా విలసిల్లుతోందని మంత్రి చెప్పారు. గతంలో రైతులకు అధికారులు ఎవరో తెలిసే వారు కాదని నేడు ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు తెలియజేశారు. విత్తనాలు, ఎరువులు పారదర్శకంగా అవినీతికి తావివ్వకుండా రైతన్నలకు అందుబాటులో ఉంచామన్నారు. నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రగతి సాధించామన్నారు. మున్నేరు పై చెక్ డ్యామ్ నిర్మించుకోవడం వలన మండువేసవిలో కూడా మత్తడి పారుతున్నట్లు తెలియజేశారు. అంతకుముందు బొద్దుగొండ సర్కిల్లో బొద్దుగొండ, కొల్లాపురం ప్రజలు ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.

అలాగే కేసముద్రం మండలంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, నెల్లికుదురు మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయా మండలాల్లోని రైతు వేదికలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో కార్యక్రమాల్లో జిల్లా రైతు కోఆర్డినేటర్ బాలాజీ నాయక్, ఎంపీపీలు సుజాత, చంద్రమోహన్, మాధవి, జడ్పీటీసీలు సుచిత్ర, శ్రీనాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఖాసిం, డీఏవో చత్రు నాయక్, డి హెచ్ ఓ సూర్యనారాయణ, తహాసిల్దార్లు అశోక్, సాంబశివుడు, యోగేశ్వరరావు, మహమ్మద్ దిలావర్ ఆబిద్ అలీ, ఏవోలు రాకేష్, వెంకన్న, రవీందర్ రెడ్డి, ఏఈఓలు, క్లస్టర్ ఏఈవోలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయంలో ఆదర్శవంతమైన సాగుబడి చేస్తున్న రైతులను ఘనంగా సత్కరించారు.