ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతైన విద్యార్ధి..

ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతైన విద్యార్ధి..

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం సమీపంలో ఎస్సారెస్పీ కాలువలో పడి మంగళవారం మురళి అనే 12వసంవత్సరాల ఏడవతరగతి విద్యార్థి గల్లంతయ్యాడు.  కురవి మండలంలోని తిరుమలాపురం గ్రామానికి చెందిన మురళి కురవి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. రోజూలాగే మురళి పాఠశాలకు వచ్చాడు. తన స్నేహితుడు తేజతో కలిసి పాఠశాల విరామ సమయంలో ఎస్సారెస్పీ కాలువ వద్దకు చూసేందుకు వెళ్ళాడు.

ఎస్సారెస్పీ కాలువలో నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. మురళి ఉత్సాహంగా నీటిలోకి దిగాడు. ఈత రాకపోవడంతో ఒకసారిగా నీటి ప్రవాహంలో మురళి కొట్టుకొని పోయాడు. వెంట వచ్చిన స్నేహితుడు అరుస్తూ కాలవవెంట పరుగులు పెడుతుండడంతో..  స్థానికంగా వ్యవసాయభూములవద్ద ఉన్న ప్రజలు అక్కడికి చేరుకొని చూసేలోగానే మురళి కనిపించకుండా కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మహబూబాబాద్ ఆర్డీవో కొమురయ్య ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.