గడువు ముగిసిన చీటీ డబ్బులు చెల్లించని చిట్ ఫండ్

గడువు ముగిసిన చీటీ డబ్బులు చెల్లించని చిట్ ఫండ్
Jagityala Akshara Chit Fund Pvt ltdcheating
  • జగిత్యాల అక్షర చిట్ ఫండ్ ఎదుట బాధితుల ఆందోళన...
  • చిట్ఫండ్ కు తాళం వేసి నిరసన...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో చిట్ ఫండ్ ఆగడాలు రోజురోజుకు శృతిమించి పోతున్నాయి. కాయకష్టం చేసి పొదుపు చేసుకుని నాలుగు డబ్బులు వేనుకేసుకుంటే  భవిష్యత్తులో పనికొస్తాయి అనుకుంటే చిట్ ఫండ్ మోసాలతో బాధితులు లబోదిబోమంటున్నారు. జగిత్యాల పట్టణంలోని అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వందలాదిమంది చీటీ డబ్బులు జమ చేసుకున్నారు. కొందరు నెలల కట్టగా, మరికొందరు అధిక వడ్డీ వస్తుందని లక్షలు డిపాజిట్లు చేశారు. పట్టణానికి చెందిన సుమారు 60 మంది చీటీ ఎత్తి ఆరు నెలలు గడిచిన ఇంత వరకు డబ్బులు చెల్లించకుండా రేపు మాపు అంటూ సతాయిస్తూ వస్తున్నారు.

కరోనా సమయంలో డబ్బులు వసూలు కాలేదని... మీరు ఇచ్చిన డబ్బులు రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి పెట్టమని ఇస్తామని దాటవేస్తూ వస్తున్నారు. ఓ మహిళ తన బిడ్డ పెళ్లి పెట్టుకున్నానని డబ్బులు కావాలని కార్యాలయం చుట్టూ తిరిగిన ఫలితం లేక పోవడంతో రోదిస్తూ వెనుదిరిగింది. మంగళవారం పలువురు బాధితులు అక్షర చిట్ఫండ్ కార్యాలయానికి తరలివచ్చి మేనేజర్ తో వాగ్వాదానికి దిగారు. ఎంత చెప్పినా ఇప్పుడు చెల్లించలేమని మేనేజర్ తేల్చి చెప్పడంతో విసుకు చెందిన బాధితులు ఉద్యోగులను కార్యాలయంలోఉంచి బయట నుంచి తాళం వేసి నిరసన తెలిపారు. అవసరాలకు కోసం డబ్బులు చిట్ ఫండ్ లో జమ చేసుకుంటే సమయానికి డబ్బులు ఇవ్వక ఇబ్బందుల గురి చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.