ఎండలకు భయపడి బడికి పిల్లలొస్తలేరు!

ఎండలకు భయపడి బడికి పిల్లలొస్తలేరు!

కేసముద్రం, ముద్ర: మండుతున్న ఎండలకు భయపడి తమ పిల్లలను తల్లిదండ్రులు బడికి పంపడం లేదు. ఫలితంగా పాఠశాలలు తెరిచి వారం రోజులు కావస్తున్నప్పటికీ ఆశించిన సంఖ్యలో విద్యార్థుల్లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి. వారం రోజుల నుంచి ఎండ తీవ్రత 40 సెంటీగ్రేడ్లకు పైనే ఉండడంతో పాటు వడగాల్పులు వీస్తుండడంతో పిల్లలను బయట తిరగకుండా తల్లిదండ్రులు కట్టడి చేస్తున్నారు. కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లోని 84 ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు వేల మందికి పైగా విద్యార్థులు పాఠశాలలకు రావాల్సి ఉండగా ఆ సంఖ్య పదిహేను వందలకు మించడం లేదు. కొన్ని పాఠశాలలకు అసలు విద్యార్థులు రావడం లేదు. ఫలితంగా ఉపాధ్యాయులు పిల్లల కోసం ఇల్లిల్లు తిరిగినా, గింత ఎండలో బడికి ఎట్లా పంపాలి సారు అంటూ తల్లిదండ్రులు తిరస్కరిస్తున్నట్లు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఒక్క వాన పడ్డంక పంపిస్తాం సారు అంటూ సమాధానం ఇస్తున్నారని చెబుతున్నారు. విద్యార్థులతో కళకళలాడాల్సిన ప్రభుత్వ పాఠశాలలు నిర్మానిష్యంగా మారిపోయాయి.