ఇంకెంతకాలం కొనుగోలు కేంద్రాల్లో ఉండాలి

ఇంకెంతకాలం కొనుగోలు కేంద్రాల్లో ఉండాలి

కేసముద్రం, ముద్ర: యాసంగి సీజన్ లో ధాన్యాన్ని పండించి నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రాల్లో పోసినా నేటికీ కొనుగోలు పూర్తి చేయకుండా రైతులను ప్రభుత్వం గోసపుచ్చుకుంటోందని టిపిసిసి సభ్యుడు గుగులోత్ దశ్రు నాయక్, మహబూబాబాద్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ తోట వెంకన్న , కేసముద్రం మండల అధ్యక్షుడు చిర వెంకన్న ఆరోపించారు. కేసముద్రం మండలం కాట్రపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు సందర్శించి రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు బంధు పేరుతో రైతులకు పెట్టుబడి సాయం అందించి, పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయకుండా, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేస్తున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇటీవల కరీంనగర్ కు ధాన్యాన్ని పంపగా ఒక్కో బస్తా కి మూడు నుంచి నాలుగు కిలోలు తరుగు పేరుతో దండుకున్నారని దుయ్యబట్టారు. పంట పండించడానికి, పండించిన పంట విక్రయించడానికి అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ధాన్యానికి క్వింటాలకు 2500 రూపాయలు మద్దతు ధర అందించాలని, వర్షాలు పడే అవకాశం ఉన్నందున వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు  మల్లయ్య, ప్రభాకర్, సంపత్, అహల్య దేవి, నీలమ్మ, ఐలయ్య,లాల్ సింగ్, యాదగిరి, చంద్రయ్య, వీరు నాయక్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.