శ్రీరామనవమి వేళ అయోధ్యలో మహా అద్భుతం...

శ్రీరామనవమి వేళ అయోధ్యలో మహా అద్భుతం...

ముద్ర,సెంట్రల్ డెస్క్:- శ్రీరామనవమి వేళ అయోధ్యలో అద్భుతం చోటు చేసుకుంది. గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదుటిని సూర్యుడి కిరణాలు ముద్దాడాయి. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. అయోధ్య రామ మందిరం నిర్మించే సమయంలోనే.. ప్రతీ శ్రీరామనవమికి మధ్యాహ్నం 12 గంటలకు రాముడి విగ్రహంపై సూర్యుడి కిరణాలు పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

శ్రీరామనవమి సందర్భంగా గర్భగుడిలో ఉన్న అయోధ్య రాముడి నుదుటిపై సూర్య తిలకం కనువిందు చేసింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3-3.5 నిమిషాల పాటు.. ఇలా బాలరాముడికి సూర్య తిలకంలా సూర్యుడి కిరణాలు ప్రసరించాయి. రాముడి విగ్రహం నుదుటిపై బొట్టులా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో.. 3-3.5 నిమిషాలపాటు ప్రసరించాయి. అయోధ్య రామాలయ నిర్మాణం చేపట్టే సమయంలోనే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుల కోరిక మేరకు కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ-సీబీఆర్‌ఐ శాస్త్రవేత్తలు ఇలా శ్రీరామనవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం పూట సూర్యతిలకం వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అయితే ఈ సూర్యతిలకం ఏటా శ్రీరామనవమి రోజున అయోధ్యలో కనువిందు చేయనుంది. ఇక అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం పూర్తి చేసుకున్న తర్వాత తొలిసారి ఈ అపూర్వ ఘట్టం చోటు చేసుకోవడం విశేషం. అయితే మరో 19 సంవత్సరాల పాటు శ్రీరామనవమి రోజు బాలరాముడి విగ్రహంపై ఇలా సూర్య తిలకం ఏర్పడనుంది. సూర్య తిలకం ఏర్పడిన సమయంలో గర్భగుడిలో ఉన్న అర్చకులు.. బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.