కేంద్ర ఉద్యోగులకు  3 శాతం డీఏ!

కేంద్ర ఉద్యోగులకు  3 శాతం డీఏ!
  • డబుల్​బొనాంజా ప్రకటించిన ప్రభుత్వం
  • కోటి మంది ఉద్యోగులు, పింఛనర్లకు ప్రయోజనం

ముంబై: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం డబుల్ బొనాంజా ప్రకటించబోతోంది. రెండోసారి డీఏ పెంచడం ఖాయమనే వార్త ఉద్యోగులకు మరింత సంతోషాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే డియర్‌నెస్ అలవెన్స్ కరవు భత్యం (డీఏ) 42 శాతంగా ఉండగా అది మరింత పెరగనుంది. ఇటీవల వరుసగా 4 శాతం పెంచగా.. ఈసారి 3 శాతానికి పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో డీఏ 42 శాతం నుంచి 45 శాతానికి చేరుతుంది. డియర్‌నెస్ అలవెన్స్ పెరిగితే కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం దక్కనుంది. అయితే డీఏను పెంచేందుకు.. లేటెస్ట్ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం) పరిగణనలోకి తీసుకుంటుంది. ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా.. ఈ డీఏ పెంపు గురించి మాట్లాడారు. తాము 4 శాతం కరవు భత్యం పెంచాలని కోరుకుంటున్నా అది సాధ్యం కాట్లేదని చెప్పారు. అందుకే ఇప్పుడు 3 శాతం పెరిగి 45 శాతానికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఖర్చుల విభాగం అన్ని లెక్కలు వేసి వివరాల్ని వెల్లడించిన తర్వాత.. ఆ ప్రతిపాదన కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. అయితే సాధారణంగా ప్రతి ఏడాది కూడా డీఏ సవరణ రెండు సార్లు జరగాల్సి ఉంటుంది. ఇది జనవరి, జూలైలో ఉంటుంది. అయితే ప్రతిసారి కాస్త ఆలస్యంగా అంటే మార్చి, సెప్టెంబర్ ఇలాంటి సమయాల్లో డీఏపై కేంద్రం ప్రకటన చేస్తూ వస్తోంది. చివరిసారి జనవరికి సంబంధించి మార్చి 24న డీఏ పెంచింది. అయినప్పటికీ ఇది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. అంటే ముందటి బకాయిలతో కలిపి డీఏ చెల్లిస్తుందన్నమాట. ఇక ఇప్పుడు డీఏ పెరిగినా కూడా అది జూలై 1 నుంచే వర్తిస్తుంది.