దేశంలో వసూలు చేస్తున్నదంతా మోడీ టాక్స్...

దేశంలో వసూలు చేస్తున్నదంతా మోడీ టాక్స్...
  • కార్పొరేట్లకు మేలు చేకూర్చడం.. ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా తిరిగి రాబట్టుకోవడమే మోడీ టాక్స్
  • మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడం,  రిజర్వేషన్లు ఎత్తివేయడం ఖాయం
  • మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో  టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్  మధు యాష్కి గౌడ్

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్:దేశంలో ప్రస్తుతం మోడీ టాక్స్ నడుస్తోందని.. దేశ ప్రజల నుంచి వసూలు చేసిన టాక్స్ ను 21 మంది పారిశ్రామిక వ్యక్తులకు ధారాదత్తం  చేస్తున్నారని, ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా కార్పొరేట్ల నుంచి  ఆ టాక్స్ తీసుకుంటున్నారని  టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఆరోపించారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో  మధుయాష్కితో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని  శుక్రవారం బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ. .

దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు ఒక కుట్ర లో భాగంగానే తమకు 400 సీట్లు ఇవ్వాలంటూ మోడీ ప్రజలను కోరుతున్నారని విమర్శించారు. సంపన్నులు,  బడా కార్పోరేట్లకే తప్ప పేద ప్రజలకు మోడీ ఏం చేశారో చెప్పలేని స్థితిలో ఉన్నారని ఆరోపించారు. 

మోడీ హయంలో ఆదానీ, అంబానీల ఆస్తులు ఏ విధంగా పెరిగాయో అందరికీ తెలుసునని అన్నారు. దేశంలో అత్యంత ధనిక పార్టీగా బిజెపి ఎదిగిందంటే .. కార్పొరేట్  సంస్థలను బెదిరించడం లేదా లబ్ధి చేకూర్చి  ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపి వసూలు చేసిందని ఆరోపించారు.తెలంగాణలోనూ బి ఆర్ ఎస్ పార్టీ అదేవిధంగా  అక్రమాలు చేసిందని, దేశంలోనే మూడో అతిపెద్ద  సంపన్న పార్టీగా ఎదిగిందని అన్నారు. అభివృద్ధి చెప్పుకోలేని స్థితిలో ఉన్న మోడీ.. ప్రజల మధ్య మత విద్వేషాలను  పెంచి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. 

కరోనా విపత్తు నిర్వహణలో మోడీ ప్రభుత్వం విఫలమైందని, ఆక్సిజన్ అందగా సరైన వైద్యం లేక లక్షలాది మంది చనిపోయారని ఆరోపించారు. రవాణా సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో రైల్వే ట్రాక్లపై ప్రమాదాలు గురై చనిపోయారని పేర్కొన్నారు.కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో పై  ప్రధాని మోడీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.