కేంద్ర మంత్రిపై కేటీఆర్​ ఆగ్రహం

కేంద్ర మంత్రిపై కేటీఆర్​ ఆగ్రహం
  • హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండవ దశ సాధ్యం కాదన్న హరిదీప్​సింగ్​
  • కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్​ లేఖ 
  • వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగర ట్రాఫిక్ రద్దీ సరిపోదనడం అర్థరహితం
  • యూపీలోని వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్, మీరట్ వంటి చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులు
  •  తెలంగాణకు మొండి చేయి చూపించడం ముమ్మాటికి వివక్షనే

ముద్ర తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్రం చేతులెత్తేయడం పై తెలంగాణ  మంత్రి కే తారక రామారావు కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం ఘాటైన లేఖ సంధించారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరికి కేటీఆర్ ఒక లేఖ రాశారు. అత్యంత రద్దీ కలిగిన హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ దశ సాధ్యం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన నగరాలకు మాత్రం పక్షపాత ధోరణితో మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తన లేఖలో కేటీఆర్ ఎత్తిచూపారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతోపాటు చాలా తక్కువ జనాభా కలిగిన లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్, మీరట్ వంటి ఉత్తరప్రదేశ్ లోని చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను కేంద్రం కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. జనాభా రద్దీ తక్కువగా ఉన్న ఇలాంటి నగరాలకు మెట్రో రైల్ కు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్న కేంద్రం, హైదరాబాద్ నగరానికి మాత్రం మెట్రో రైల్ విస్తరణ అర్హత లేదని చెప్పడం తనకు అత్యంత ఆశ్చర్యానికి గురి చేసిందని కేటీఆర్ అన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా హైదరాబాద్ ఉన్నదని ఇలాంటి నగరంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాదన అర్ధరహితం అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని  అనేక చిన్న నగరాలు, పట్టణాలు మెట్రో రైల్ ప్రాజెక్టులకి అర్హత సాధించినప్పుడు హైదరాబాద్ మెట్రో నగరానికి మాత్రం ఎందుకు ఆ అర్హత పొందదని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

ఇది కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పక్షపాత దృక్పథంతో తీసుకున్న నిర్ణయమేనన్న భావన కలుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్న వివిధ రంగాల్లోని ప్రాజెక్టులు, కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను అనేకసార్లు తమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, స్వయంగా తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సానుకూల స్పందన రాలేదన్నారు. దేశంలో తెలంగాణతో పోల్చుకుంటే ఎలాంటి అర్హతలు లేకున్నా ఇతర పట్టణాలకు, రాష్ట్రాలకు ప్రాజెక్టులను కట్టబెడుతూ తెలంగాణకు పదేపదే కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ఇది కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ నగరం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న పక్షపాత దృక్పథమేనని,  కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇప్పటికే అనేకసార్లు కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి శాఖకు మెట్రో రైల్ రెండవ దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించడంతోపాటు డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ (డిపిఅర్) సైతం అందించామన్నారు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, పిహెచ్పిడిటీ గణాంకాలు, ఇతర అర్హతలను, సానుకూలతలను అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ మున్సిపల్ శాఖ తరపున గతంలో అందించిన సమాచారం తాలూకు నివేదికలను ఈ సందర్భంగా కేటీఆర్ జతచేశారు. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని రకాల సమాచారం అందించినా, తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెబుతున్న నేపథ్యంలో మరోసారి సమగ్ర సమాచారాన్ని, అన్ని రకాల పత్రాలను నివేదికలను కేంద్రానికి పంపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.   కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరిని వ్యక్తిగతంగా కలిసి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ దశ ప్రాధాన్యతను వివరించేందుకు తాను స్వయంగా అనేకసార్లు ప్రయత్నించినా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేటీఆర్ అన్నారు. అయితే కేంద్రమంత్రి హరదీప్ సింగ్ పూరి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖ హైదరాబాద్ నగర మౌలిక వసతుల ప్రాజెక్టులు విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా, అవసరాలే ప్రాతిపదికగా సరైన నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రాజెక్టులు కేటాయిస్తారని ఆశించిన్నట్లు కేటీఆర్ తెలిపారు. అయినప్పటికీ హైదరాబాద్ నగర మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశ ప్రతిపాదనలో ఉన్న సానుకూలతలను దృష్టిలో ఉంచుకొని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నట్లు, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసందుకు, అవసరమైన సమాచారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేటీఆర్ తన లేఖలో హర్దీప్ సింగ్ పూరికి తెలిపారు.