టిఎస్ ఆర్టీసిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి: టిఎస్ ఆర్టీసి జేఏసీ డిమాండ్

టిఎస్ ఆర్టీసిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి: టిఎస్ ఆర్టీసి జేఏసీ డిమాండ్

ముద్ర, ముషీరాబాద్: టిఎస్ ఆర్టీసి లో యూనియన్లను పునరుద్ధరించి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని టిఎస్ఆర్టిసి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ అశ్వద్ధామరెడ్డి (టి ఎమ్ యు), కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ (టిజెఎంయు)లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టిసి ఉద్యోగులకు వేతన సవరణ చేయాలన్నారు. డి ఎలు సమయానికి ప్రకటించాలన్నారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలన్నారు. అదే విధంగా మూసివేసిన డిపోలను తెరిచి ఖాళీలను భర్తీ చేయాలన్నారు. వేధింపులకు గురి చేయకుండా మహిళా కండక్టర్లకు 8 గంటల లోపు పూర్తయ్యేలా డ్యూటీలు వేయాలని అన్నారు. కండక్టర్లకు, డ్రైవర్లకు ఈ పీకే, కే ఎం పి ఎల్ సాకుతో వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. గ్యారేజీలలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానాలను రద్దుచేసి రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని డిపోలను సందర్శించి అక్కడ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటామని, వాటిని చైర్మన్ కు వివరిస్తామని చెప్పారు. 

అయినప్పటికీ వారు స్పందించకపోతే జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. గతంలో ఉన్న జేఏసీ ని రద్దు చేసామన్నారు. ఇప్పుడు  ఏర్పాటైన జేఏసీ కార్మికుల సమస్యల కోసం అంకితభావంతో కృషి చేస్తుందన్నారు. మూడు సంఘాల మిత్రులు వారి స్వలాభం కోసం జేఏసీతో కలిసి రావడం లేదని, కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. వారికి కార్మికుల సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాజకీయాలకు అతీతంగా ఏర్పడిన జేఏసీతో కలిసి రావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కో కన్వీనర్లు నరేందర్ (ఎన్ఎంయు), స్వామి(బిఎమ్ఎస్), అబ్రహం (ఎస్డబ్ల్యూయు), సురేష్ (బిడబ్ల్యుయు), యాదగిరి (టిఎన్టీయుసి), హరికిషన్ (ఎస్ టి ఎమ్ యు) తదితర జేఏసీ నాయకులు పాల్గొన్నారు.