తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
  • ఎవరి ప్రత్యేకత  వారిదే
  • ధాన్యంతో సిఎం కేసిఆర్,మంత్రి హరీష్ రావు చిత్రాన్ని వేసిన రైతులు
  • 5కే రన్ నిర్వహించి, 100 డయల్ బెలూన్ ఎగరవేసిన పోలీసులు
  • రైతులకు భోజనాలు వడ్డించిన జిల్లా కలెక్టర్

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల వారు వాటిని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  పోలీస్ శాఖ సురక్షా దినోత్సవం పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే శనివారం రోజున సిద్దిపేట నడిబొడ్డున  వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డయల్ 100 ద్వారా పోలీసులు అందిస్తున్న సేవలు గురించి  బెలూన్ ఎగురవేశారు. పోలీస్ కమిషనర్ శ్వేత ప్రత్యేకంగా ఈ బెలూన్ ఏర్పాటు చేయించారు. త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో 5 కే రన్ నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగాపోలీస్ కమిషనర్ ఆదేశానుసారం త్రీ టౌన్  సీఐ భాను ప్రకాష్ పోలీస్ సిబ్బంది, స్థానిక  ప్రజా ప్రతినిధులు కలసి ఏన్సాన్ పల్లి అంబేద్కర్ చౌరస్తా నుండి తడకపల్లి బస్ స్టాప్ వరకు 5కె రన్ జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ మాట్లాడుతూ  ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ఆరోగ్యమే మహాభాగ్యమని మంచి ఆరోగ్యం గురించి ప్రతిరోజు యోగా రన్నింగ్ వాకింగ్ ధ్యానం చేయాలని సూచించారు.

రైతు బిడ్డలు. నవ ధాన్యాలతో నేతల చిత్రాలు

సిద్దిపేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవం నిర్వహించారు . ఈ సందర్భంగా రైతులు పండించిన ధాన్యంతో సీఎం కేసీఆర్,మంత్రి హరీష్  రావు బొమ్మలను చిత్రించారు ఇది అందరినీ ఆకట్టుకుంది. మర్కుక్ లో రైతు వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది  ఉత్సవాలు, తెలంగాణ రైతు దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కుకులోని రైతు వేదిక  రైతు దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న ఏర్పాట్లను పరిశీలించి  రైతులతో మాట్లాడారు.  

రైతు దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ముందుగా మర్కుక్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి శ్యాం ప్రసాద్, జిల్లా ఉద్యానవన అధికారి సునీతలు తెలంగాణ సాధించిన తొమ్మిది సంవత్సరాల కాలంలో వ్యవసాయం, ఉద్యానవన రంగాలలో సాధించిన ప్రగతిని వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మర్కుక్ ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, మర్కుక్ సర్పంచ్ భాస్కర్, డిఆర్డిఏ అడిషనల్ పిడి కౌసల్య, మండలంలోని ఇతర ప్రజా ప్రతినిధులు, రైతుల తదితరులు పాల్గొన్నారు.