ప్రభుత్వ హాస్పిటల్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.

ప్రభుత్వ హాస్పిటల్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
  • అలసత్వం వహిస్తే వైద్యశాఖ మంత్రి హరీష్ రావు కార్యాలయాన్ని ముట్టడిస్తాం
  • యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ముందు ధర్నా,  జిల్లా వైద్యాధికారికి ప్రగతిశీల యువజన సంఘం వినతిపత్రం
           

భువనగిరి ఆగస్టు 18 (ముద్ర న్యూస్):-జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యల నిలయాలుగా మారాయని, వెంటనే హాస్పిటల్లలోని సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ యాదాద్రి-భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా వైద్యాధికారి కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ బంగారు తెలంగాణలో పేదలకు కనీస వైద్య సదుపాయాలు లేవని అన్ని మండల కేంద్రాల్లో 50 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని నియోజకవర్గ కేంద్రాలలో 100 పడగల ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచినా,  దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నాడే తప్ప పేదలకు అత్యవసరమైన ఉచిత వైద్యం గురించి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనీ, ఏ మండల ఆస్పత్రిలో కూడా ప్రభుత్వ అంబులెన్స్ లేదని, ఒకవేళ దాతలు ఎవరైనా అంబులెన్స్ ని ఇస్తే దానికి డ్రైవర్ ని కేటాయించే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని ,  హాస్పిటల్ లో సరిపడా వైద్యులు లేరని 24 గంటల వైద్యం అందిస్తున్నామని చెపుతున్నా కూడా అవి కేవలం మాటలకే పరిమితం అని రాత్రి వేళల్లో కేవలం నర్సులతోనే వైద్యం అందిస్తున్నారని అత్యవసర పరిస్థితి వస్తే వాళ్లు బయటి హాస్పిటల్ కి వెళ్ళమని చెప్తున్నారు అని, డాక్టర్లు లేకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, మండల కేంద్రాల్లోని హాస్పిటల్లలో ల్యాబులు ఉన్నా వాటికి సరిపడా సిబ్బంది లేరనీ, కేవలం 15రకాల పరీక్షలు మాత్రమే మండల స్థాయి హాస్పిటళ్లలో చేస్తున్నారనీ, థైరాయిడ్ ,డెంగీ ,మలేరియా, టైఫాయిడు లాంటి పరీక్షలు కావాలంటే భువనగిరికి పంపుతున్నారనీ,  వాటి ఫలితాలు సకాలంలో రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,  స్వీపర్లను కాంట్రాక్టు పద్దతిలో నియమించడం వల్ల , బాత్రూంలను రోజూ శుభ్రం చేయకపోవడం వల్ల రోగులు దుర్వాసనల మధ్యనే ఉండాల్సి వస్తోందని, ఎక్స్ రే, స్కానింగ్ పరికరాలు లేవనీ, ఒకవేళ పరికరాలు ఉంటే వాటి ఆపరేటర్లు లేరనీ ఇలా బంగారు తెలంగాణ వైద్య పరిస్థితి దారుణంగా ఉందనీ, పై సమస్యలన్నింటినీ వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని లేని యెడల  ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా యువతీ,యువకులను, ప్రజలను ఏకం చేసి వైద్య శాఖ మంత్రి హరీష్ రావు కార్యాలయాన్ని మరియు ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.  

ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్.జిల్లా అధ్యక్షులు సాధుల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులుగుండు నరేందర్, బాబు, సహాయ కార్యదర్శి చిరబోయిన బాలకృష్ణ, కోశాధికారి శికిలం వెంకటేష్, జిల్లా నాయకులు పుర్మ భాస్కర్, పగడాల శివ, దడిగే కృష్ణ, ఆర్ ఉదయ్, పురాణం ఉపేందర్, పి సతీష్, ఎం నరసింహులు ,ఏ వేణుగోపాల్ రెడ్డి, బి రాజు, వెంకటేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.