అవుటర్ చుట్టూ టౌన్ షిప్ లు... భట్టివిక్రమార్క

అవుటర్ చుట్టూ టౌన్ షిప్ లు... భట్టివిక్రమార్క

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ హెచ్‌ఎండీఏకు ఉన్న ఖాళీ భూముల్లో టౌన్‌షిప్‌లను నిర్మించడం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను సృష్టించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు.ఆర్థిక వ్యవస్థలో హెచ్‌ఎండీఏ కీలక భూమిక పోషించాలన్నారు. బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా సచివాలయంలోని తన కార్యాలయంలో గురువారం పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''టౌన్‌షిప్‌ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్న రహదారుల విస్తరణ ఎంతవరకు ఉంటుందన్నది మార్క్‌ చేయాలి. దీనిద్వారా ఇళ్లు నిర్మించడం, తర్వాత తొలగించాల్సిన అవసరం ఉండదు. లేఅవుట్లలో మార్ట్‌గేజ్‌ చేసిన ప్లాట్లను అభివృద్ధి చేయకుండా వదిలేస్తున్నారు.

వాటిపై దృష్టి సారించాలి. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద వచ్చిన 39 లక్షల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి.పారిశ్రామికవాడల్లో వేలం ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లను వినియోగించని పక్షంలో వాటిని వెనక్కు తీసుకోవాలి. అది సాధ్యంకాని పక్షంలో ప్రభుత్వ వాటాను రాబట్టాలి. హెచ్‌ఎండీఏ పరిధిలో చెరువులకు సంబంధించి ఒక్కో సందర్భంలో ఒక్కో సంఖ్య చెబుతున్నారు. వాటిని శాస్త్రబద్ధంగా నమోదు చేయాలి'' అని భట్టివిక్రమార్క అన్నారు.