ఛత్తీస్’ సీఎం విష్ణుదేవ్ 

ఛత్తీస్’ సీఎం విష్ణుదేవ్ 

ఆదివాసీ సముదాయానికి బీజేపీ పెద్దపీట

ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ సీఎం పదవి ఎంపిక పీఠముడి వీడింది. ఆదివారం ఎమ్మెల్యేలతో కేంద్ర పరిశీలకులు జరిపిన భేటీ అనంతరం ఆదివాసీ ఎమ్మెల్యే విష్ణుదేవ్ సాయ్ను సీఎంగా ప్రకటించారు. 12 గంటల నుంచి రాయ్పూర్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలతో పరీశీలకులు అర్జున్ ముండా, సర్బానంద్ సోనోవాల్, దుష్యంత్ గౌతమ్, రమణ్సింగ్, రాష్ర్ట అధ్యక్షులు తదితర ముఖ్యలు భేటీ అయి అభిప్రాయాలను తీసుకున్నారు. సీఎంగా ఎంపికవడం పట్ల బీజేపీ నేతలు, ఆదివాసీ సంఘాలు విష్ణుదేవ్కు శుభాకాంక్షలు తెలిపాయి. మొదటిసారిగా ఆదివాసీల తరఫున సీఎం సీటుకు విష్ణుదేవ్ ఎంపికయ్యారు. ఈయన నాలుగుసార్లు ఎంపీ, రెండుసార్లు, ఎమ్మెల్యే, రాష్ర్ట అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన విశేష అనుభవం ఉంది.

ఆదివాసీల నేత అంటే విష్ణుదేవ్.. విష్ణుదేవ్ అంటే ఆదివాసీలు అన్నంతలా దైవంలా భావిస్తారు. అంతేగాకుండా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. అదే సమయంలో బస్తర్, సర్జుజా జిల్లాల్లో 36 సీట్లలో కేవలం నాలుగు సీట్లను మాత్రమే కాంగ్రెస్ గెలవగలిగింది. 32 సీట్లను ఆదివాసీ వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో విష్ణుదేవ్ వల్లే గెలుపు సాధ్యమైనట్లు రాజకీయ సమీకరణాలు చెబుతున్నాయి.

కాగా ఈసారీ పోటీలో బీజేపీ ఆదివాసీల నియోజకవర్గాల్లో విష్ణుదేవ్, రేణుకాసింగ్ల నేతృత్వంలో ప్రచారంలో పైచేయి సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ ఆదివాసీల ఓటింగ్ ఎటువైపు మొగ్గుచూపనుందో అనే విషయాన్ని అంచనా వేయడంలో వెనుకంజ వేసింది. విష్ణుదేవ్ 1980 నుంచి బీజేపీ పార్టీలో ఉన్నారు. 2023 జరిగిన ఎన్నికల్లో కున్కురీ నుంచి పోటీలో ఉండగా 25,541 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.