సిద్దిపేట జిల్లాలో నీటి సంరక్షణ చర్యలు బెష్

సిద్దిపేట జిల్లాలో నీటి సంరక్షణ చర్యలు బెష్

సెంట్రల్ డిఫెన్స్ మినిస్ట్రీ జాయింట్ సెక్రెటరీ అండ్ అడిషనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వేద్ వీర్ ఆర్య

ముద్ర ప్రతినిధి :సిద్దిపేట జిల్లాలో నీటి సంరక్షణ చర్యలు సమర్థ వంతంగా ఉన్నాయని   సెంట్రల్ డిఫెన్స్ మినిస్ట్రీ జాయింట్ సెక్రెటరీ అండ్ అడిషనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వేద్ వీర్ ఆర్య  జిల్లా అధికారులను మెచ్చుకున్నారు. కేంద్ర జల శక్తి అభియాన్ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా మరో టెక్నికల్ ఆఫీసర్ తో కలిసి ఆయన మంగళవారం రోజున సిద్దిపేటకు విచ్చేశారు జిల్లా కలెక్టరేట్ సముదాయంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో నీటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ కోసం,వర్షం నీరును ఒడిసి పట్టేందుకు చెక్ డ్యాములు,ఇంకుడు గుంతలు,ఫామ్ పాండ్ల నిర్మాణం,అటవీ ప్రాంతాల్లో రాక్ ఫీల్ డ్యామ్స్,చెక్ డాములు, వాటర్ సాసర్ల నిర్మాణం, స్ట్రంచుల నిర్మాణం, వ్యవసాయ రంగంలో వరికి బదులు తక్కువ సాగునీటితో సాగయ్యే ఆయిల్ ఫామ్ తదితర ప్రత్యామ్నాయ పంటల సాగు,బిందు సేద్యం, గ్రామాలు, మున్సిపాలిటీలలో నీటి సంరక్షణ చేపట్టిన చర్యలను సంబంధిత శాఖల అధికారులు ప్రొజెక్టర్ ద్వారా జలశక్తియాన్ అధికారులకు వివరించారు.


 జిల్లాలో వర్షం నీటిని ఒడిసి పట్టడం,నీటి సంరక్షణకు జిల్లాలో చేపట్టిన పనులు చాలా బాగా ఉన్నాయని ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి అధికారి వేద్ వీర్ ఆర్యా అభినందించారు. భూగర్భ జల సంరక్షణ మరి భూగర్భ జలాల పెంపునకు చేపట్టిన పనుల ఫలితాలు కనబడుతున్నాయని అన్నారు. నీరు అనేది మానవ జీవితంలో అతి ముఖ్యమైనదని మానవ శరీరంలో కూడా 75% నీరు ఉంటుందని అన్నారు. పాఠశాలలలో పిల్లలకు నీటి సంరక్షణ గురించి చెబుతున్న తీరు చాలా బాగా ఉందని బావి పౌరులైన  చిన్నారులకు, ప్రజలందరికీ నీటి సంరక్షణ పై విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. ముందుగా జిల్లాకు విచ్చేసిన అధికారులకు కలెక్టర్ ప్రశాంత జీవన్ పాటిల్ స్వాగతం పలికారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్, డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి  శివ ప్రసాద్, జిల్లా హార్టికల్చర్ అధికారి సునీత, డిఆర్డిఏ అడిషనల్ పిడి కౌసల్యాదేవి, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంపత్, ఇరిగేషన్,గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులు పాల్గొన్నారు.