మెరుగైన రవాణాతో ప్రజలకు మరింత దగ్గరవుతాం

మెరుగైన రవాణాతో ప్రజలకు మరింత దగ్గరవుతాం
  • సిద్దిపేట నుంచి సోలాపూర్ బస్సులు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
  • త్వరలో మహారాష్ట్రలోని గొందియాకు బస్సులు వేస్తాం

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రవాణా సౌకర్యాలను ప్రభుత్వం ఎంతో మెరుగుపరిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. మెరుగైన రవాణా సౌకర్యాలతో ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువైందని హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట కొత్త బస్టాండ్ లో సిద్దిపేట నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్ కు నూతనంగా మూడు ఆర్టీసీ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు సిద్దిపేట నుండి సికింద్రాబాద్ హైదరాబాద్ వెళ్లడానికి కేవలం ఆర్డినరీ బస్సులు కొన్ని ,ఎక్స్ ప్రెస్ బస్సులు మరికొన్ని మాత్రమే ఉండేవన్నారు. ప్రస్తుతము సిద్దిపేట డిపో నుండి ఎక్స్ ప్రెస్ బస్సులతో పాటు డీలక్స్ బస్సులను కూడా స్థానిక డిపో ద్వారా అన్ని ప్రాంతాలకు నడుపుతున్నామన్నారు.  ఇక్కడి ప్రాంత ప్రజలు మహారాష్ట్రలో చాలా చోట్ల నివసిస్తున్నందున వారి సౌకర్యార్థం సోలాపూర్ కు మూడు బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో మహారాష్ట్రలోని గొందియాకు రెండు ప్రత్యేక బస్సులను ప్రారంభిస్తామన్నారు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు మరో ఐదు డీలక్స్ బస్సులను రోజు నడిపేందుకు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సోలాపూర్ బస్సుల ప్రారంభ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ ఎం సుదర్శన్, డిప్యూటీ ఆర్ ఎం దైవాదినం, సిద్దిపేట ఆర్డిఓ అనంతరెడ్డి, డిఎం సుఖేందర్ రెడ్డి,డిపో సిఐ మహేశ్వరి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ, సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్సు, కౌన్సిలర్లు నాయకం లక్ష్మణ్, సాకి ఆనంద్ తోపాటు స్థానిక నాయకులు పలువురు పాల్గొన్నారు.