డబల్ బెడ్ రూమ్ లు ఇంకెప్పుడిస్తరు ? 

డబల్ బెడ్ రూమ్ లు ఇంకెప్పుడిస్తరు ? 
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఎక్కడ
  • కలెక్టరేట్ ముందు బిజెపి భారీ ధర్నా
  • జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకుఅర్హులైన నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ లు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ,బిజెపి నేత మాజీమంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ లు మాట్లాడుతూ  కేసీఆర్ ప్రభుత్వం లో నిరుపేదలకు సొంతింటి కల అందని ద్రాక్షగా  మారిందని మండిపడ్డారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా రాష్ట్రంలోని కెసిఆర్ సర్కార్ నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూములు అందిస్తామని ఊరించడం తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా డబల్ బెడ్ రూమ్ ల పై ఊదరగొట్టే ప్రకటనలు చేసి  నిరుపేదలను మోసం చేస్తుందన్నారు. అన్ని అర్హతలు ఉండి ఇల్లుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలు లక్షలాది మంది ఉన్నారని తెలిపారు. ఇన్నేళ్లలో అరకోర నిర్మాణాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఆ ఇల్లులను కూడాఎవరికి పంపిణీ చేయకపోవడంతో నిరుపయోగంగా , అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు నాణ్యతలేని పనులతో   శిథిలావస్థకు చేరుకున్నాయని ఆరోపించారు. అనేక ప్రాంతాల్లో డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు జరిగి ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో అధికార పార్టీ నాయకులు సంబంధిత కార్యాలయంలో చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని పేర్కొన్నారు. పేదలు  ఇల్లుల కోసం ప్రాధేయ పడడం బాధాకరమన్నారు. డబల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకుంది మొదలు , ఇల్లు కేటాయించే వరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సంఘటనలు రాష్ట్రంలో ఉన్నాయని , నిరుపేదల గూడు కల ను కలగానే  మిగిల్చిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పేద ప్రజల ఇల్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనసు, చేతులు రావడంలేదన్నారు.  

వంద గదులతో ప్రగతి భవన్ నిర్మించుకోవడానికి , పోనీ సెక్రటేరియట్ కు వేలకోట్ల  రూపాయలు ఖర్చు చేయడానికి, అనేక పనికి మాలిన కార్యక్రమలకు ప్రజల సొమ్ము  దుబారా చేస్తుంది బిఆర్ఎస్ ప్రభుత్వమని దుయ్యబట్టారు.  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిరుపేదలందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని, రాష్ట్రంలో ఆ స్కీంకింద   2.5 లక్షల  ఇల్లులు మంజూరయ్యాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి  సొంతింటి కల నిజం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 3033  నివాసాలు మంజూరయ్యాయన్నారు.  ఆ ఇళ్ళ నిర్మాణం ఎంతవరకు వచ్చింది ఎంతమంది లబ్ధిదారులకు ఇల్లులు పంపిణీ చేశారని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం  ప్రధానమంత్రి ఆవాస్ యోజన   నిధులను డబల్ బెడ్ రూమ్ ఇల్లుల కోసం మళ్లించి  సాధించింది ఏమిటన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ బత్తుల లక్ష్మీనారాయణ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, నాయకులు గడ్డం నాగరాజు,చేపూరి సత్యం, కటకం  లోకేష్, బొంతల కళ్యాణ్ చంద్ర, జానపట్ల స్వామి, ఎడమ సత్యనారాయణ రెడ్డి, జెల్ల సుధాకర్, సింగిరెడ్డి కృష్ణారెడ్డి,చొప్పరి జయశ్రీ, పుప్పాల రఘు ,బల్బీర్ సింగ్, దుబాల శ్రీనివాస్, కడార్ల రతన్, నరహరి లక్ష్మారెడ్డి, మాడిశెట్టి సంతోష్, దుడ్డెల లక్ష్మీనారాయణ, రాపాక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.