భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలి

భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలి

 ఆర్ఎస్ఎస్ విభాగ్ శారీరక్ ప్రముఖ్ సామల కిరణ్

 భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కరీనగర్ విభాగ్ శారీరఖ్ ప్రముఖ్ సామల కిరణ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో  ఉగాది ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పొన్నాల గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన సామల కిరణ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి గొప్పదైన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలని అన్నారు. మనం జరుపుకునే ప్రతి పండగల్లో చారిత్రక, ఆధ్యాత్మిక భావనతో పాటు శాస్త్రీయ విజ్ఞానం దాగి ఉందని, ఈ విషయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజును ఉగాదిగా జరుపుకుంటామని, అదే విధంగా శ్రీరామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాతవాహన లాంటి చక్రవర్తులు పట్టాభిషేకం జరుపుకున్న రోజు కూడా ఉగాది అని తెలిపారు. కాల గణనలో భారతీయ విజ్ఞానం చాలా గొప్పదని మన పూర్వీకులు ఒక నిమిషాన్ని కూడా  విభజించి కాల గణన చేశారని తెలిపారు.

కాలగణన ఆధారంగానే పంచాంగాన్ని రూపొందించారని, భవిష్యత్తులో ప్రకృతిలో, ఖగోళంలో జరిగే మార్పులను తెలుసుకోగలిగే శాస్త్రీయత పంచాంగం లో ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ జన్మించిన రోజు ఉగాది అని తెలిపారు. అన్ని రంగాలలో విశ్వ గురువుగా ఉన్న భారతదేశం కొద్దిమంది విదేశీయుల దాడితో స్వాతంత్రం కోల్పోయిందని గమనించిన డాక్టర్ హెడ్గేవార్ హిందూ సంఘటన కోసం ఆర్ఎస్ఎస్ ను స్థాపించారన్నారు. శాఖ మాధ్యమంగా హిందువుల్లో ఐకమత్యం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కొద్ది మందితో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా అన్ని జీవన రంగాలలో తన ప్రభావాన్ని చూపుతుందన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటుందని, ఈ సందర్భంగా దేశంలోని లక్ష గ్రామాలలో ఆర్ఎస్ఎస్ శాఖలను విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం పోస్ట్ మాన్ లకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పోస్టల్ సూపరిండెంట్ రవీందర్ అధ్యక్షత వహించగా ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలకులు డాక్టర్ భీమనాతిని శంకర్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, నగర సంఘచాలాక్ జిడిగే పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.