కొత్తగా ‘రైతుబంధు' కోసం దరఖాస్తుల స్వీకరణ

కొత్తగా ‘రైతుబంధు' కోసం దరఖాస్తుల స్వీకరణ

కేసముద్రం, ముద్ర: కొత్తగా భూములు ఖరీదు చేసిన రైతులకు ప్రభుత్వం సాగు పెట్టుబడి కోసం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు భీమా పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా కొత్తగా భూములను ఖరీదు చేసిన రైతుల వివరాలను వ్యవసాయ శాఖ ఇప్పటికే సేకరించింది. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాలో ఈ వానాకాలంలో సాగు పెట్టుబడి కోసం ఎకరానికి 10 వేల చొప్పున ఏడాదికి అందించేందుకు రైతు బంధు, రైతు మరణిస్తే 5 లక్షల రూపాయలు అందించడానికి అమలు చేస్తున్న రైతు బీమా పథకాలకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయాధికారి చత్రు నాయక్ కోరారు. జిల్లాలో ఇప్పటికే 1లక్ష 98 వేల మంది రైతులకు రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తుండగా తాజాగా 4,762 మంది రైతులు కొత్తగా ఆయా పథకాలకు అర్హులుగా గుర్తించినట్లు చెప్పారు. బయ్యారం మండలంలో 129, చిన్న గూడూరు 95, దంతాలపల్లి 231, డోర్నకల్ 263, గంగారం 18, గార్ల 76, గూడూరు 214, కేసముద్రం 586, కొత్తగూడ 47, కురవి 542, మహబూబాబాద్ 424, మరిపెడ 702, నరసింహుల పేట 190, నెల్లికుదురు 415, పెద్ద వంగర 273, తొర్రూరు మండలంలో 557 మంది కొత్త రైతులను గుర్తించామని వారంతా కొత్తగా రైతుబంధు రైతు బీమా పథకాల కోసం ఆయా మండలాల్లోని వ్యవసాయ అధికారులకు దరఖాస్తులు సమర్పించాలని డిఏఓ కోరారు. రైతు బీమా పథకానికి పట్టా పాస్ పుస్తకం తో పాటు రైతు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు, దరఖాస్తు ఫారం నింపి ఇవ్వాలన్నారు. అలాగే రైతు బంధు పథకానికి పట్టా పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాలతో పాటు దరఖాస్తు పత్రం నింపి అందజేయాలన్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ కొంతమంది రైతులు బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డు, దరఖాస్తు ఇవ్వకపోవడంతో రైతుబంధు రైతు బీమా పథకాలు వారికి అందకుండా పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఆ విధంగా పట్టా పాస్ పుస్తకం ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన రైతులు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.