అదను దాటుతోందని..

అదను దాటుతోందని..
  • నీటి పదనుతో 
  • విత్తనాలు నాటుతున్న రైతులు

కేసముద్రం, ముద్ర: వర్షా కాలం ప్రారంభమై మృగశిర కార్తె పూర్తయి, ఆరుద్ర కార్తె సగం రోజులు దాటుతున్నా వర్ణ దేవుడు కరుణ చూపకపోవడంతో అదను దాటుతోందని రైతులు నీటి పదనుతో విత్తనాలు నాటుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వాన కాలంలో ఆరుతడి పంటల కింద సాగు చేసే ప్రధాన పంటలు పత్తి, మక్కజొన్న, కంది విత్తనాలను సాగు చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. బావుల్లో  నిండుగా నీరు ఉండడంతో పాటు విద్యుత్తు సౌకర్యం ఉండడం వల్ల రైతులు విద్యుత్ మోటార్ల ద్వారా నీళ్లతో నేలను తడిపి విత్తనాలను నాటుతున్నారు. కేసముద్రం మండలం తావుర్యా తండా శివారు ముత్యాలమ్మ తండా లో బుక్యా జీజ అనే మహిళ రైతు మాట్లాడుతూ అదను దాటితే విత్తనం నాటినా మంచి దిగుబడి రాదని, కష్టమైనా.నష్టమైనా అదనులోనే నాటాలంటూ పెద్దలు చెప్పిన పద్ధతి పాటిస్తున్నామంటూ చెప్పింది.