నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటం

నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటం

గ్రూప్-1 హాల్ టికెట్ ను కాల్చి నిరసన 

కేసముద్రం, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన పానుగంటి విష్ణువర్ధన్ అనే దళిత యువకుడు ఈనెల 11న తాను హాజరయ్యే గ్రూప్1 పరీక్ష హాల్ టికెట్ ను ఆదివారం నాడు స్థానిక అంబేద్కర్ సెంటర్లో దహనం చేసి నిరసన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నామమాత్రపు అరెస్టులతో కాలం గడుపుతూ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ కేసును సిట్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ పూర్తికాకుండా, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయకుండానే మళ్లీ పరీక్షలు నిర్వహించి పబ్బం గడుపు కోవాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నిర్వహించే పరీక్షలు అన్నీ కూడా ముందస్తుగానే దళారులచే బేరం కుదుర్చుకుని ఆంగట్లో సరుకులుగా అమ్ముకుంటున్నారని, పోటీ పరీక్షల నిర్వహణలో నిఘా యంత్రాంగం పూర్తిస్థాయిలో విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాలాంటి నిరుద్యోగులకు నమ్మకం లేదని, తక్షణమే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలని, అదే విధంగా గ్రూప్ 1 స్థాయి ఉద్యోగ పరీక్షలనిర్వహణను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే దశాబ్ది ఉత్సవాలలో నిరుద్యోగ భృతిని ప్రకటించాలని విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు.