ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కెశశాంక

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కెశశాంక

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: ప్రజలు గ్రీవెన్స్ లో ఇచ్చిన దరఖాస్తులను అధికారులు ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని జిల్లాకలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ లో సోమవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లు (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్, ఎం డేవిడ్ (రెవెన్యూ) లతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ముందుగా వేసవి కాలం దృష్ట్యా జిల్లా పశువైద్యాధికారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని క్యాంటీన్ఏర్పాటు చేసిన  మజ్జిగ కౌంటర్ ను ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ వేసవి కాలంలో ఆరోగ్యo చల్లదనానికి మజ్జిగ ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.  అనంతరం ప్రజావాణిలో  నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన ముక్కెరపల్లి కొండ స్వామి గత 12 సంవత్సరాల నుండి లేబర్ కార్డు రెన్యువల్ చేసుకుంటున్నానని, తన కూతురి మెటర్నిటీ క్లైమ్ కొరకు మీ సేవాలో దరఖాస్తు చేసుకుని చాలా రోజులవుతుందని నా దరఖాస్తును పరిశీలించి మెటర్నిటీ క్లైమ్ ఇపించగలరని కోరారు.

డోర్నకల్ మండలానికి చెందిన డోర్నకల్ బంధం చెరువు ఆయకట్టు రైతులు డోర్నకల్ బంధం చెరువును కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుని రైతులను వారి పొలాలకు వెళ్ళకుండా అడ్డు కుంటున్నాడని, పెద్ద చెరువు నుండి వచ్చే అలుగు నీళ్ళు మున్నేరువాగులోకి పోకుండా మట్టిరాళ్ళు పోసినందువలన చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉన్నందున సర్వే జరిపి రైతులకు వారి,వారి పొలాలకు పోవుటకు దారిని ఏర్పాటు చేసి హద్దురాళ్ళు పాతించి పంటలకు నష్టం వాటిల్లకుండా తగు న్యాయం చేయగలరని కోరారు. మహబూబాబాద్ పట్టణం ఇందిరా కాలనికి చెందిన లాల్ సింగ్ కాలనీ పనులకు ఖర్చు చేసిన బడ్జెట్ వివరాల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. 

పెద్దవంగర మండలం చిన్న వంగర గ్రామానికి చెందిన పాకనాటి ఉపేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన పాకనాటి సోమారెడ్డి ఎల్ పిఎస్ ద్వారా దళితులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 3 ఎకరాల భూమి పంపిణీ విషయం లో సర్వే నెంబర్.231/ఎ/2 నందు గల 3 ఎకరాల 27 గుంటల విస్తీర్ణం గల భూమిని ప్రభుత్వానికి అమ్మి లభ్దిదారులను  భూమి ఖాస్తుకు పోనివ్వకుండా అక్రమంగా వేరే ఇతర వ్యక్తులకు అమ్మి సొమ్ముచేసుకున్నాడని సర్వే చేపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన సఫియా సుల్తానా జి.ఓ.నెం.58,59 ద్వారా పట్టా భూమి కోసం డబ్బులు ఇదివరకే చెల్లించామని కానీ ఇప్పుడు భూమి లేదని అంటున్నారని పట్టా కాగితాలు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఉద్యానవన నిర్వహణ పనితీరుకు ప్రభుత్వం ద్వారా అత్యుత్తమ అవార్డు ఎంపికకు కృషి చేసిన అధికారులను పూలమొక్కను అందజేసి శాలువాతో సత్కరించి కలెక్టర్ శశాంక అభినందించారు. గ్రీవెన్స్ లో 115 దరఖాస్తులు రాగా.. పరిష్కారం కొరకు   సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈప్రజావాణి లో జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.