గవర్నర్ తమిళిసైకు లేఖ రాసిన మంత్రి  సత్యవతి రాథోడ్

గవర్నర్ తమిళిసైకు లేఖ రాసిన మంత్రి  సత్యవతి రాథోడ్
  • గవర్నర్ తమిళిసైకి తెలంగాణ యువత పట్ల ప్రేమ ఉంటే తొక్కిపెట్టిన కొలువుల బిల్లులపై వెంటనే సంతకం చేయాలి
  • తెలంగాణ యువత ఎదుర్కొంటున్న సవాళ్ళకి కారణం కేంద్ర ప్రభుత్వం మరియు హైదరాబాదులోని రాజ్ భవనే కారణమని తెలుసుకోవాలన్న మంత్రి
  • ఈ ఉగాది పండగ సందర్భంగా యువత ఎదుర్కొంటున్న చేదును దాటి తీపి రోజులు వచ్చేలా కేంద్ర ప్రభుత్వ వివక్ష పైన స్పందించాలని కోరిన మంత్రి
  • తెలంగాణ యువత ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలపైన వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గళమెత్తాలని కోరిన మంత్రి.
  • ఈ ప్రక్రియలో మాతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి  సత్యవతి రాథోడ్

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గార్కి, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలతో, మీరు నిన్న రాజ్ భవన్ లో జరిపిన ఉగాది ఉత్సవాల్లో తెలంగాణ యువతకు దక్కాల్సిన అవకాశాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలను చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని దాటుకొని మంచి రోజులు వస్తాయని అన్నారు. సరిగ్గా తెలంగాణ యువత సైతం కేంద్ర ప్రభుత్వ వైఖరి, వివక్ష వల్లనే తమకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని బలంగా నమ్ముతున్నారు. ఒకవైపు స్వయంగా గవర్నర్ హోదాలో మీరు తెలంగాణ యువకులు ఉపాధి అవకాశాలను అడ్డుకునేలా బిల్లులను తొక్కి పెడుతున్న విషయాన్ని సైతం వారు మర్చిపోవడం లేదు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అనేక అన్యాయాల గుర్తుంచుకుంటున్నారు. వలన తమకు జరుగుతున్న నష్టాన్ని కూడా నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జరిగిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల అమలు అయ్యేలా మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఆ దిశగా ఇచ్చిన లక్ష ప్రభుత్వ ఉద్యోగాల హామీని దాటి రెండు లక్షల 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకుంటున్నాము. దీంతోపాటు ప్రైవేటు రంగంలో దాదాపు 22 లక్షల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేలా, పారిశ్రామిక విధానాన్ని రూపొందించి తెలంగాణను ఒక పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చుకున్నాము. ముఖ్యంగా ఐటీ రంగంలో భారీగా నూతన ఉద్యోగాలను కల్పించుకుంటూ దేశానికి అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాము. కానీ తెలంగాణపైన తొలి రోజు నుంచి ఓర్వలేనితనంతో వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఐటిఐఆర్ ను రద్దు చేసి హైదరాబాద్ తెలంగాణ యువకుల ఉపాధి అవకాశాలపై భారీదెబ్బ కొట్టింది. మరోపైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బకొట్టడుతూనే, తెలంగాణకు దక్కాల్సిన విద్యాసంస్థల విషయంలోనూ తీరని అన్యాయం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాలను కూడా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీని కేటాయించలేదు. విభజన చట్టం హామీ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును తుంగలో తొక్కింది. ఒకవైపు విద్యాసంస్థలు ఇవ్వకుండా కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం అటు ఉపాధి అవకాశాలను కల్పించే విభజన చట్టం హామీలను సైతం పక్కన పెట్టింది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందికి తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనుకున్నాం. వేలాది కానీ ఇప్పటిదాకా బయ్యారం విషయంలో కేంద్రం వైఖరిపైన మీరు మాట్లాడలేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు వస్తాయనుకున్నా, దానిపైన కూడా కేంద్రంతోపాటు, మీరు కూడా ఏనాడు స్పందించలేదు. ప్రత్యేక రాయితీలిచ్చి పెట్టుబడులను ప్రొత్సహిస్తామన్న హమీని కూడా కేంద్రం మరిచిపోయింది. ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్నా, ఢిపెన్స్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ వంటి వాటిని ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం వివక్షతో పక్కన పెట్టింది. ఇలా కేంద్రం తెలంగాణ యువతపైన చూపుతున్న కక్షపూరిత వైఖరిపైన ఎనాడు ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం మీరు కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా ఒక్క లేఖనో, విజ్ఞప్తినో చేయకపోవడం విచారకరం. ఇది తెలంగాణ యువతపైన పడుతుంది. అవకాశవాద ప్రేమకు అద్దం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయాలన్న సమున్నత లక్ష్యంతో తీసుకువచ్చిన యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లును తొక్కిపెట్టిన విషయాన్ని మీరు సౌకర్యంగా మర్చిపోయినట్లు అనిపిస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ యువత ఎదుర్కొంటున్న సవాళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా కారణం అయితే, ఉద్యోగ అవకాశాలు కల్పించే బిల్లులను తొక్కిపెట్టి పరోక్షంగా మీరు కూడా కారణం అవుతున్నారని గుర్తుచేస్తున్నాను. దీంతోపాటు యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాలను  అందించాలని ఉద్దేశించిన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లులను కూడా మీరు పక్కన పెట్టిన విషయం మర్చిపోయారు. అందుకే రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సవాళ్లకు రాజభవన్ మరియు కేంద్ర ప్రభుత్వమే ప్రధానమైన కారణమని, యువత ఇబ్బందులు మీ పుణ్యమే అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. నిజంగానే రాజ్ భవన్ చాలెంజ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటే, తెలంగాణ యువత మీకు ఇస్తున్న ఛాలెంజ్ ను స్వీకరించి కేంద్ర ప్రభుత్వం వైఖరి పైన యువత పక్షాన నిలబడండి. యువతకు రాజ్ భవన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మాట వాస్తవం అయితే కేంద్ర ప్రభుత్వ అన్యాయాలను అడ్డుకోండి. తెలంగాణ యువత ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలపైన వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపైన గళమెత్తండి. ఈ ప్రక్రియలో మాతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

మీ
( సత్యవతి రాథోడ్ )