వినియోగదారులే దేవుళ్ళు.... జిల్లాకలెక్టర్ శశాంక

వినియోగదారులే దేవుళ్ళు.... జిల్లాకలెక్టర్ శశాంక

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: విద్యుత్ సంస్థ  విజయవంతంగా ముందుకు వెళుతున్నదంటే వినియోగదారులే కారణమని, సంతృప్తికరమైన సేవలందిస్తేనే సంస్థకు లాభాలు చేకూరుతాయని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. మహబూబాబాద్ లో శుక్రవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుండి ఏడవ తేదీ వరకు నిర్వహిస్తున్న విద్యుత్తు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థ  విజయవంతంగా ముందుకు వెళుతున్నదంటే వినియోగదారుల కారణమన్నారు. వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలందించినప్పుడే విద్యుత్ శాఖ మనుగడ సాధిస్తుంది అన్నారు. తెలంగాణ రాకముందు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళమని రాష్ట్రం సాధించుకున్న తర్వాత నాణ్యమైన విద్యుత్తును పొందగలుగుతున్నామన్నారు. విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పులతో పాటు అభివృద్ధి సాధించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ ఉద్యోగుల శ్రమలతో ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు.

సబ్ స్టేషన్ లో నిర్మాణాలు కూడా పెరిగాయి అన్నారు. సిబ్బంది  కొరత లేదని, ఉత్పత్తిని పెంచుకోవడంతో డిమాండ్ కు తగినస్థాయికి చేరుకోగలిగేమన్నారు. జిల్లాలో రెండు లక్షల కనెక్షన్లు ఉండగా ఒక లక్షఅరవైవేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయన్నారు. విద్యుత్ భద్రతపై సరైన అవగాహన లేకనే 2022 సంవత్సరంలో 38 మందిని కోల్పోయామన్నారు. ఎంత నష్ట పరిహారం ఇచ్చినా ఆ కుటుంబాలకు జరిగిన ఆర్ధిక నష్టం పూడ్చలేమన్నారు. చేపలు పట్టే మత్స్యకారులు వేటలో విద్యుత్ వినియోగించడం వలన, ఇంటిలో బట్టలు ఆరవేస్తూ విద్యుత్ ప్రవాహం జరిగి  అనాధలైన పిల్లలు సంఘటన మదిని కలచివేసిందన్నారు. గ్రామాలలో 160 పశువులు కోల్పోవడం బాధా కరమన్నారు.  50శాతం ఎస్సి, ఎస్టీ, జనాభా ఉన్న జిల్లాలో 33 గ్రామాలను దత్తత తీసుకొని అవగాహన పరచడం అభినందనీయమన్నారు. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో 95శాతం కులధృవీకరణ పత్రాలు ఉన్నాయని మిగతా వారికి కూడా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
గ్రామాలలో విద్యుత్ అధికారుల సమాచారం తప్పనిసరిగా ఉండాలన్నారు. అనంతరం లైన్మెన్ లకు విద్యుత్ భద్రత వస్తువులను కలెక్టర్ శశాంక పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ నరేష్, డిఈ లు విజయ్, సునీతదేవి, మధుసూదన్, ఏఈలు విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ వినియోగదారులు కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.