బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్‌

బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్‌

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన, శ్రీ ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్టపన, బొడ్రాయి పండుగ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో బుదవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆప్యాయ పలకరింపులతో మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవము అనేది మహాలక్ష్మి అంశ అని, బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అని అన్నారు..ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజలందరికి అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని, ప్రతీ ఒక్కరు తమ మత ఆచారాల కు అనుగుణంగా దైవ చింతన ను కలిగి ఉండటం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుందని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.

అందులో భాగంగానే ఆడపడుచులను సైతం పిలుస్తారని... ఊరిలోని వారంతా కలిసి ఐక్యమత్యంగా ఉండాలని ఊరి బాగు కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలనేది దీని వెనక ఉన్న ప్రధాన ఆంతర్యం అని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ఆలయాల పునః:ప్రతిష్ట ఎంతో వైభవంగా కొనసాగుతున్నదన్నారు. కొందరు దేవుడు వారికి మాత్రమే సొంతం అనే విధంగా మాట్లాడుతున్నారు అది సరికాదు అని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని మతాలకు, కులాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వమే స్వయంగా అన్ని పండుగలను నిర్వహించడం దేశం లో మరెక్కడా లేదని అన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న ప్రేమ అని కొనియాడారు. గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దాట్ల సర్పంచ్ కొమ్మినేని రవీందర్, ఉపసర్పంచ్ బూరయ్య, సింగిల్ విండో డైరెక్టర్ పేరాల కాంతారావు, బీఆర్ఎస్ నాయకులు తాటిపాముల రవీంద్రాచారి, పొడిశెట్టి భాస్కర్, సంకట రమేష్ మిడతపల్లి పర్షియా తదితరులు పాల్గొన్నారు.