రైతుబంధు రాలే పంట నష్ట పరిహారం రాలే

రైతుబంధు రాలే పంట నష్ట పరిహారం రాలే

వడ్ల పైసలు రాలే 
ఎవుసం ముందుకు సాగేదెట్లా?
కేసముద్రం ముద్ర: కాలం నెత్తి మీదకు వచ్చింది.  అన్నదాతలకు ఈ ఏడు ఎవుసం చేయడానికి చేతిలో డబ్బులు లేక దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు చాలామంది రైతులకు డబ్బులు చెల్లించలేదు. అలాగే యాసంగిలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం ప్రకటించినప్పటికీ డబ్బులు అందించలేదు. ఇక సాగు పెట్టుబడి కోసం ప్రతి సీజన్లో ముందుగానే రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 5,000 చొప్పున మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,85,000 మంది రైతులకు రైతుబంధు కింద  211 కోట్ల రూపాయలను అందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆ ఉసే లేదు. ఇక మహబూబాబాద్ నియోజకవర్గంలో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు 5,960 రైతులకు చెందిన 4,423 ఎకరాల్లో పంట నష్టానికి ఎకరానికి 10,000 చొప్పున 4,42,32,250 రూపాయలను పరిహారం కింద ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.

 అయితే పంట నష్టం చెల్లింపు కోసం యాక్సిస్ బ్యాంకు ను నోడల్ బ్యాంకు గా నియమించగా, యూనియన్ బ్యాంకులో ఖాతాలున్న రైతులకు సాంకేతిక లోపం తలెత్తడంతో ఇప్పటివరకు ఒక కేసముద్రం మండలంలోని 683 మంది రైతులకు పరిహారం అందలేదు. ఇలా నియోజకవర్గ పరిధిలో యూనియన్ బ్యాంకు ఖాతాదారులకు పంట నష్టపరిహారం అందలేదు. ఇక మరోవైపు యాసంగిలో ధాన్యం పండించిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం వందలాది మంది రైతులకు డబ్బులు చెల్లించలేదు. కేసముద్రం, ధనసరి సొసైటీ పరిధిలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 2000 మందికి పైగా రైతుల నుంచి ధాన్యం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటివరకు 40 శాతం మంది రైతులకు మాత్రమే డబ్బులు చెల్లించినట్లు చెబుతున్నారు. ఇంకా 60 శాతం మందికి డబ్బులు చెల్లించాల్సి ఉందని, దశలవారీగా డబ్బులు చెల్లిస్తున్నామని ఆయా సొసైటీల సీఈవోలు మల్లారెడ్డి, వెంకటాచలం  తెలిపారు. దీనితో ఈ వాన కాలంలో పంటల సాగు కోసం అన్నదాతలు చేతిలో చిల్లి గవ్వలేక విలవిలలాడుతున్నారు.

ధాన్యం డబ్బులు వస్తేనే ‘సాగు'తది: మొగుల గాని సుధాకర్, రైతు, తాళ్లపూస పల్లి
యాసంగిలో పండించిన దాన్యం గవర్నమెంట్ కు అమ్మిన. 123 బస్తాలు కాంటా పెట్టుకొని నెలరోజులు దాటింది. లక్ష రూపాయలకు పైగా నాకు డబ్బులు రావాల్సి ఉంది. డబ్బులు బ్యాంకు ఖాతాలో వేస్తామని కొనుగోలు సెంటర్ ఇన్చార్జి చెప్పారు. ధాన్యం డబ్బులు వస్తే, పెట్టుబడి ఖర్చులు, అప్పుడు తీర్చి మిగిలిన సొమ్ముతో వానకాలం పంట సాగుకు అవసరమైన విత్తనాలు ఎరువులు తెచ్చుకోవాల్సి ఉందని, తాళ్ల పూస పల్లికి చెందిన మొగులగాని సుధాకర్ అనే రైతు చెప్పాడు. డబ్బుల కోసం అధికారులను అడిగితే రేపు మాకు వస్తాయని సమాధానం చెబుతున్నారు. చేతిలో చిల్లి గవ్వలేక పైసల కోసం ఎదురుచూస్తున్నట్లు సుధాకర్ చెప్పాడు.