లక్ష కోసం ఆఖరు మోఖా! మీసేవ కేంద్రాల వద్ద కొనసాగుతున్న రద్దీ

లక్ష కోసం ఆఖరు మోఖా! మీసేవ కేంద్రాల వద్ద కొనసాగుతున్న రద్దీ

కేసముద్రం, ముద్ర: చేతివృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం కోసం మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఇందుకోసం అవసరమైన సర్టిఫికెట్ల కోసం ఒక్కసారిగా జనం తహసిల్ కార్యాలయాలు మీసేవ కేంద్రాలకు వెళ్ళడంతో ప్రభుత్వం పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం ఏర్పాటు చేసి చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం పథకం నిరంతర ప్రక్రియగా ప్రకటించింది. అయితే ఈ అంశంపై స్పష్టత లేకపోవడం, క్షేత్రస్థాయి అధికారులకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో మంగళవారం చివరి రోజున దరఖాస్తులు చేసుకోవడానికి బీసీ కులాలకు చెందిన వందనాది మంది మీ సేవ, ఆన్లైన్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు.

దీనితో మీసేవ, ఆన్లైన్ కేంద్రాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉండగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ కోసం అవసరమైన కులం ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసిన అర్జీదారులకు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 8 గంటల వరకు సర్టిఫికెట్ల జారీ కోసం మీసేవ ప్రొవైడర్ ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించినట్లు నిర్వాహకులు చెప్పారు. సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సర్టిఫికెట్లు జారీ చేయడానికి సర్వర్ ఎర్రర్, బిజీ వస్తుండడంతో ఆ సమయంలో మిగిలిన సేవలను నిలిపివేసి కేవలం కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తుదారులకు రసీదులు జారీ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ కోసం దరఖాస్తు గడువు పై నెలకొన్న గందరగోళ పరిస్థితులను నివృత్తి చేయాలని, దరఖాస్తు గడువును పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.