రైతులు అధైర్య పడవద్దు... 

రైతులు అధైర్య పడవద్దు... 
  •  ప్రభుత్వం అండగా ఉంది...  
  •  మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: అకాల వర్షాలకు పంటలు నష్ట పోయామని ఆత్మధైర్యాన్ని కోల్పోరాదని, ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ శశాంక స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూధన పల్లి గ్రామంలో గురువారం పర్యటించి అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, మామిడి పంటలను రైతులతోనూ సంబంధిత వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించారు. మొక్కజొన్న పంట కోల్పోయిన నాగయ్య కలెక్టర్ కు వివరిస్తూ నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకొని మొక్కజొన్న వేశానని అకాల వర్షాలతో పంట నష్టపోయానని వాపోయారు.

అదే గ్రామంలోని మామిడి తోట రైతు గాండ్ల వెంకన్న నేలరాలిన మామిడికాయలు కలెక్టర్ శశాంకకు చూపిస్తూ, లక్షన్నర పెట్టుబడి పెట్టగా రెండు లక్షలు వస్తాయని ఆశించానని రెండు రోజుల్లో పంట విక్రయాలు ఉండగా చేతుకొచ్చిన పంట నేలరాలిపోయిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ అకాల వర్షాలకు ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ళముందే కోల్పోవడం బాధాకరమని... ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు ఏమి చేయలేమని రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్య పడరాదని ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు ప్రభుత్వం అండగా ఉంటుందని నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తామన్నారు. కలెక్టర్ శశాంక వెంట వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ తహసిల్దార్ ఇమ్మానియేల్, మండల వ్యవసాయఅధికారి మంజుఖాన్  తదితరులు ఉన్నారు.