అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలి.. 

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలి.. 

 ప్రజల మన్ననలను పొందాలి.. జిల్లా కలెక్టర్ శశాంక..

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: ప్రభుత్వం అభివృద్ధి పనుల కొరకు కోట్లల్లో నిధులు మంజూరు చేస్తున్నదని అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు. మహబూబాబాద్ సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయం లోని సమావేశ మందిరంలో బుదవారం మహబూబాబాద్ నియోజకవర్గస్థాయిలో2014 సంవత్సరము నుండి వివిధ శాఖలైన నీటిపారుదల, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, విద్య,వైద్యం, గిరిజనసంక్షేమం, వంటి ప్రధాన శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతి పై శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ అధ్యక్షతన  కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ...
యాసంగి పంటకు నీరు అందే విధంగా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో డిబిఎం 48 ద్వారా ఎస్ఆర్ఎస్పి కాలువల నుండి వచ్చే నీటితో 60 వేల ఎకరాలు సాగవుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 95% ఆయకట్టుకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు నియోజకవర్గంలో 346 చెరువులు ఉన్నాయని 9 చెక్ డ్యామ్ లు ఉన్నాయన్నారు. నీరందని ప్రాంతాలలో ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగు కారణాల పై నివేదిక ఇవ్వాలన్నారు. సాగునీరు సరఫరా కాకుండా కాలువలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు సాగునీరు చివరి రైతుల భూములకు అందే విధంగా రైతులందరూ సమన్వయంతో సహకరించుకోవాలన్నారు.

గూడూరు ,కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్ తదితర మండలాల పరిధిలో నిర్మిస్తున్న రహదారులు బ్రిడ్జిల నిర్మాణ పనులు మార్చి నెలాఖరులోగా పూర్తి చేసి నివేదిక అందించాలన్నారు. సమస్యలుంటే పరిష్కరించుకోవాలి గాని జాప్యం చేయడం తగదన్నారు. రోడ్లు భవనాల శాఖ పనితీరుపై సమీక్షిస్తూ మార్చినెలాఖరులోగా రహదారుల పనులు పూర్తిచేసి నివేదికలను అందించాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిల పునర్ నిర్మాణానికి ప్రతి పాదనలు రూపొందించాలన్నారు. శాఖ పరిధిలో నిర్మాణం తలపెట్టిన సబ్ సెంటర్ల ను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు పూర్తయిన సబ్ సెంటర్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు.