రైలు బండి వస్తేనే చదువు సాగేది!

రైలు బండి వస్తేనే చదువు సాగేది!
  • రైలు బండి వస్తేనే చదువు సాగేది!
  • రైలు రద్దు తో విద్యాలయాల నిర్వహణ అస్తవ్యస్తం

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థుల చదువులు రైళ్ల రాకపొకలపై ఆధారపడి సాగుతున్నాయి. ఆయా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు అత్యధికులు స్థానికంగా నివాసం ఉండకుండా వరంగల్, మహబూబాబాద్ తదితర పట్టణాల్లో ఉంటూ షటిల్ సర్వీసులు చేస్తున్నారు. నిత్యం వరంగల్ నుంచి ఉదయం పూట పుష్ పుల్, కృష్ణ ఎక్స్ప్రెస్ లో, ఇటు మహబూబాబాద్ నుంచి సింగరేణి, శాతవాహన ఎక్స్ ప్రెస్ రైళ్లలో కేసముద్రం చేరుకొని అక్కడ నుంచి ద్విచక్ర వాహనాలు లేదంటే ప్రైవేటు టాక్సీ ల ద్వారా పాఠశాలలకు రావడం నిత్యకృత్యం. ఇక మరికొందరు ఏకంగా వరంగల్ నగరం నుంచే ప్రత్యేకంగా కారులో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వరంగల్ నుంచి కేసముద్రం వైపు వచ్చే పుష్ పుల్ రైలును రైల్వే శాఖ సాంకేతిక కారణాలతో రద్దు చేసింది.  పాఠశాల తెరిచే నిర్ణీత సమయం ప్రాథమిక పాఠశాల ఉదయం 8:45, హై స్కూల్ ఉదయం 9:30 గంటలకు రావాల్సి ఉండగా పుష్పుల్ రైలు రద్దు కారణంగా చాలామంది ఉపాధ్యాయులు  పాఠశాలకు నిర్ణీత సమయానికి రాలేదు. ఫలితంగా పలు పాఠశాలలో పిల్లలు ఉపాధ్యాయుల రాక కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు ఉపాధ్యాయులు ఆర్టీసీ బస్సుల్లో రాగా మరికొందరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న టాక్సీ లో వచ్చారు. ఇంకొందరు ఉదయం10 గంటల తర్వాత ఆలస్యంగా పాఠశాలకు చేరుకున్నారు. రైళ్ల రాకపోకలపై విద్యార్థుల చదువులు ఆధారపడి సాగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.