మీ వల్లే... నీళ్ళు

మీ వల్లే... నీళ్ళు
  • మీ వల్లే... కరెంటు
  • మీ వల్లే... రైతు బంధు
  • మీ వల్లే... రైతు బీమా
  • మీ వల్లే... ఈ పంటలు
  • మీ వల్లే... పంటల కొనుగోలు
  • మీ వల్లే కావాలి... ఈ పంటల నష్ట పరిహారాలు
  • సిఎం కెసిఆర్ కు విన్నవించుకున్న రైతులు
  • ఆ కేంద్ర ప్రభుత్వం ఏకానా ఇవ్వదు మనకు... 
  • మనమే మన ఖాజానాలకెల్లి.. ఎకరానికి రూ.10వేలు ఇచ్చుకోవాలె
  • రైతులకు భరోసానింపుతూ, ధైర్యం చెబుతూ... కెసిఆర్ నష్టపోయిన పంటల పరిశీలన

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: సార్, మీ వల్లే... నీళ్ళ వచ్చినయి. మీ వల్లే... ఈ 24 గంటల కరెంటు వస్తుంది. మీ వల్లే...మాకు రైతు బంధు పడ్తాంది. మీ వల్లే... రైతు బీమా వస్తాంది. మీ వల్లే... ఇన్ని ఈ పంటలన్నీ పండుతానయి. చివరకి మీ వల్లే... పంటల కొనుగోలు జరుగుతాంది. లేకపోతే రాష్ట్రంల రైతు దిక్కుమాలిన చావే దిక్కయ్యేది. సార్, ఇగ మీ వల్లే గీ..పంటల నష్టాలపరిహాలు కూడా ఇయ్యాలె... అంటూ పలువురు రైతులు సిఎం కెసిఆర్ కు విన్నవించుకున్నారు. దానికి ప్రతిగా రైతులకు కుశల ప్రశ్నలు వేసి, ఏం పేరు? ఎంత వేసినవు. పెట్టుబడి ఎంతైంది? నష్టం ఎంత జరిగింది? అంటూ ఆరా తీసిన సీఎం కెసిఆర్... ఆ దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం ఏకానా ఇవ్వదు మనకు.. మనమే మన ఖాజానాల కేలి.. ఎకరానికి రూ.10వేలు ఇచ్చుకోవాలె. మూడు వేలే ఇస్తరు. కానీ మీకు నష్టం ఎక్కువ జరిగింది కాబట్టి, ఎకరాకు 10వేలు ఇస్తం. అది కూడా వెంటనే అందేటట్లు చేస్త. ఇమీడియట్ గా అధికారులకు చెబుతా. మీరు మాత్రం అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఈ పంటలు సరే, వచ్చే పంటల గురించి ఆలోచించండి. అంటూ సీఎం కెసిఆర్ పంటలు నష్టపోయిన రైతులకు మనోధైర్యాన్ని నింపారు. నేనున్నాననే భరోసానిచ్చారు.

మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, పెద్దవంగర మండలంలోని రెడ్డికుంటతండా, పోచారం, వడ్డేకొత్తపల్లి, బొమ్మకల్ రెవిన్యూ గ్రామాల్లో నష్టపోయిన పంటలను సిఎం కేసిఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన స్వయంగా పంటలను చూశారు. రైతులతో మాట్లాడిన పంట నష్టాలను ఆరా తీశారు. వారితో మాట్లాడి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్న హామీ ఇచ్చారు. దొంగలు పడ్డంక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కాకుండా...మీ నష్ట పరిహారాన్ని తొందరగానే పంపింస్తామని హామీ చ్చారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సిఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్ రావు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, అడిషన్ కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు వెంటరాగా, సిఎం కెసిఆర్,రెడ్డికుంటతండాకు చెందిన ఝాటోత్ చిన్న సోమ్లాతో మాట్లాడారు. నీ పేరేంపేరు? ఎంత పంట వేసినవు. ఎంత నష్టం జరిగింది? అంటూ ప్రశ్నించారు. అందుకు సోమ్లా బదులిస్తూ,  మూడుఎకరాలు మొక్కజొన్న వేసిన సర్, కంకి పాలుపోసుకనే టైం.. ఒక్కసారిగా వచ్చిన వడగండ్లు మాకు కడగండ్లు మిగిల్చినయి. లక్ష వరకు నష్టం జరిగింది. అని తెలిపారు. దీంతో సిఎం కేసిర్ మాట్లాడుతూ.. మీరేమీ అధైర్యపడొద్దు. ఎలాగూ నష్టం వచ్చింది. ఇలాంటి టైమ్ లోనే ధైర్యంగా ఉండాలి. మీకు అండగా ప్రభుత్వం ఉంటది. అంటూ ముందుకు కదిలారు.

అనంతరం సిఎం కేసీఆర్ ఝాటోత్ పెద్ద సోమ్లా దగ్గరకు వెళ్ళారు. అతడు...మిర్చీ వేశాను సార్. ఎకరాకు లక్ష 50వేలు పెట్టుబడి అయింది. ఒక్కసారి కూడా కాయ తెంపలేదు. వడగండ్లకు కాయ పగిలి, గింజలు బయటపడ్డాయి. చేను మొత్తం వాలిపోయింది. సర్, రైతు బంధు ఇస్తాండ్రు. కరెంటు, నీళ్ళు అన్నీ వస్తున్నాయి సర్, అందువల్లే పంటలు బాగా వేసినం. కానీ ఈ చెడగొట్టు వానే, మమ్మల్ని ముంచింది. అంటూ విలపించాడు. దీంతో సీఎం కెసార్ మాట్లాడుతూ, అతడి భుజం తట్టారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అక్కడి నుండి మామిడి రైతు ఝాటోత్ నెహ్రూ నాయక్ అన్నదమ్ముల దగ్గరకు వెళ్ళారు. అక్కడ అన్నదమ్ములంతా కలిసి 20 ఎకరాల్లో మామిడి తోట పెట్టారు. కాత బాగా కాసింది. వానకు బాగానేన రాలిపోయింది. అని చెప్పగా, కాయ తెంపలేదా? అని సీఎం అడిగారు. లేదని చెప్పారు. ఇదే సీజన్...విపరీతంగా కాయ రాలిపోయింది. అని చెప్పారు. దీంతో సీఎం మాట్లాడుతూ, ఎకరాకు 10వేలు సాయం చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం అండగా వుంటుంది. అని చెప్పారు.  సిఎం వెంట... ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ రైతులు ఉన్నారు.