ఆశించిన తెలంగాణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలి.. 

ఆశించిన తెలంగాణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలి.. 
  •  పాలకులు మారినంత మాత్రాన తెలంగాణ పరిస్థితులు మారలేదు..
  •  జయశంకర్ ఆనాడే చెప్పాడు మళ్ళీ పోరాటం తప్పదని 
  •  తెజస రాష్ట్రఅధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: ఉద్యమకారుల పోరాట ఫలితంగా, తెలంగాణ ప్రజలత్యాగాలఫలంగా   ప్రత్యేకరాష్ట్రం వచ్చిందని, రాష్ట్రం వచ్చిందే తప్ప ప్రజలు ఆశించిన పరిస్థితులు మాత్రం రాలేదని దానికోసం మరో పోరాటాన్ని నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు.   తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం ప్రొపెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారం అయ్యిందన్నారు. మహబూబాబాద్ ను చూస్తుంటే.. ఈ..గడ్డపైన నడుస్తుంటే  ఎన్నో జ్ఞాపకాలు కళ్ళ ముందు కదులుతున్నాయని, తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమాన్ని అత్యంత కీలక మలుపు తిప్పిన  మానుకోటరాళ్ల దాడి చరిత్రలో చెరిపివేయాలని చూసిన చెరిగిపోని సంఘటన అని ఆయన అన్నారు. ఎంతోమంది అమరులు త్యాగాలు చేశారని, మనలాంటి ఎందరో పోరాటాలు నిర్వహించారని, ఆ పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని గుర్తుచేసారు.

మనందరి పోరాటాల పలితంగా తెలంగాణరాష్ట్రం వచ్చింది, కానీ పాలకులు మారారే తప్ప పాలనావిధానాలు మారలేదని ఆవేదన వ్యక్తం చేసారు. పోరాడి సాదించుకున్న తెలంగాణలో ప్రజల కష్టాలు తీరలేదని, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధగా ఉందని, కోత పేరుతో రైతులను గోసపెడుతున్నారని ఆరోపించారు. పోటీ పరీక్ష పేపర్లను అమ్ముకుంటూ వ్యాపారంగా మార్చారని, యువత జీవితాలతో లీకేజీ ప్రభుత్వం చలగాటమాడుతుందని మండిపడ్డారు. దశాబ్ధిఉత్సవాలు జరపాల్సి వస్తే రాష్ట్ర సాదనపోరాటాన్ని స్మరించుకునే కార్యక్రమాలు నిర్వహించాలని, రాష్ట్రం కోసం జీవితాలను, ప్రాణాలను త్యాగంచేసిన వారి చరిత్రను స్మరించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.  ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరణించే ముందు పదే..పదే  చెబుతుండేవాడని తెలంగాణ రావడం ఖాయమే అయినా..  వచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షల కోసం మళ్లీ ఇంతకంటే పెద్దపోరాటం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పే వారన్నారు. వారు చెప్పింది అక్షరసత్యంగా మారిందని, తెలంగాణలో అదే పరిస్థితి ప్రస్తుతం  నెలకొందని కోదండరాం అన్నారు.

తెలంగాణ రాష్ట్రం  కోసం ఏ ఉద్యమస్ఫూర్తితో పోరాడేమో.. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని దిక్సూచిగా తీసుకొని పోరాటాలకు సకలజనులు నడుం బిగించాలని ప్రొపెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. పోరాటంలో తెలంగాణ అభివృద్ధిని కోరుకునే అన్ని వర్గాలు కలిసి సాగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఆకాంక్షతో ఎన్నో అడ్డంకులైన ఎదుర్కొంటూ మిలియన్ మార్చ్, సాగరహారం, సకలజనులసమ్మె వంటి కార్యక్రమాలు నిర్వహించామని,  ఇప్పుడు అదే స్ఫూర్తితో తెలంగాణ ఆశించిన అభివృద్ధి కోసం ప్రజలంతా మళ్ళీ పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన మహబూబాబాద్ నుంచి రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు. పూర్వ మహబూబాబాద్ జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ జేఏసీ నాయకులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు,కార్యకర్తలు, ప్రజా సంఘాల,ఉపాధ్యాయ, విద్యార్ధి,కుల సంఘాలనాయకులు, మేధావులు,  పాల్గొన్నారు.