దేశంలో మోడీ.. రాష్ట్రంలో కేసీఆర్‌‌...  ప్రజలకు చేసిందేమీ లేదు

దేశంలో మోడీ.. రాష్ట్రంలో కేసీఆర్‌‌...  ప్రజలకు చేసిందేమీ లేదు
  • మాయ మాటలతో మోసం చేసిన్రు

  • సర్కారు మోసాలపై యువతను చైతన్యం చేస్తాం

  • టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ: మాయ మాటతో అటు దేశంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ.. ఇటు రాష్ట్రంలో పాలన సాగిన సీఎం కేసీఆర్‌‌ ప్రజలకు చేసిందేమి లేదని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ చూసినా 2014కు మందు జరిగిన అభివృద్ధే కనిపిస్తుంది తప్పు ప్రస్తుత ప్రభుత్వాలు ఏమీ చేయలేదన్నారు. ఏడాడికి 2 కోట్ల ఉద్యోగాలు అంటూ మోడీ, ఇంటికో ఉద్యోగం అంటూ కేసీఆర్‌‌ నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని ఆరోపించారు. ఈ తొమ్మిదేళ్లలో వీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్‌‌ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నామనే ప్రకటనలకే కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు జరిగిన అన్యాయాలపై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని, వారి చైతన్యం చేసేందుకు ఇటీవల హైదరాబాద్‌ సరూర్‌‌నగర్‌‌లో జరిగిన సభలో తమ నాయకురాలు ప్రియాంకగాంధీ రాజీవ్‌ యూత్‌ డిక్లరేషన్‌ను ప్రకటించారని తెలిపారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.

18న యూత్‌ ఆన్‌లైన్‌ క్విజ్‌...
తెలంగాణలోని యువతను మేల్కొలిపేందుకు కాంగ్రెస్‌ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు పొన్నాల తెలిపారు. హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ స్ఫూర్తితో 18న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్‌ గాంధీ యూత్‌ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలో 60 ప్రశ్నలు ఉంటాయని వాటికి 60 నిమిషాల్లో సమాధానాలు ఆన్‌లైన్‌లో రాయాల్సి ఉంటుందని తెలిపారు. 16 ఏళ్ల నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. విజేతలకు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌‌, ల్యాప్‌ టాప్‌, స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్‌లెట్‌, స్మార్ట్‌ వాజ్‌లు, ఇయర్‌‌ బర్డ్స్‌ తదితర బహుమతులు ఉంటాయని విరించారు. పరీక్ష రాయాలనుకునే వారు 17వ తేదీ వరకు 7661899899 అనే సెల్‌ నంబర్‌‌కు మిస్‌ కాల్‌ ఇచ్చి రిజిస్ట్రేషన్‌ వెబ్‌ లింక్‌ పొందాలని పొన్నాల సూచించారు. 

రైతులను ఆదుకోవాలి..
రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, రాళ్ల వానలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, జనగామ నియోజకవర్గంలో దాదాపు 85 వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు కాంగ్రెస్‌ పార్టీ సేకరించిన లెక్కల్లో తేలిందన్నారు. కానీ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం అందులో సగం కూడా చూపించడం లేదన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని, ఇందుకు కౌలు రైతులను కూడా అర్హులుగానే గుర్తించాలని డిమాండ్‌ చేశారు. మరో వైపు వానాకాలం పంటలకు సమయం దగ్గర పడుతున్నందున పెండింగ్‌లో రైతు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వడాలని కోరారు. సీఎం కేసీఆర్‌‌ రైతు రాజు చేస్తానని చెప్పడం కాదని.. రైతును రైతులాగా ప్రశాంతంగా బతకనిస్తే చాలని పొన్నాల ఎద్దేవ చేశారు. సమావేశంలో టీపీసీసీ మెంబర్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిర, పట్టణ, మండల అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్,  కొన్నె మహేందర్‌‌రెడ్డి, వడ్లకొండ పీఏసీఎస్‌ డైరెక్టర్ మల్లారెడ్డి, కౌన్సిలర్ వంగళ కళ్యాణి, జిల్లా నాయకులు ఉడుత రవి చింతకింది మల్లేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.డి మాజీద్, మైనారిటీ సెల్ జిల్లా నాయకులు జాఫర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. 

లోన్‌ కట్టలేదని.. వడ్ల పైసలు ఆపారు..
పొన్నాల రైతు రుణాలపై మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న జనగామ మండలం ఎర్రకుంటతండాకు రమావత్‌ శ్రీకాంత్‌ అనే రైతు రుణ మాఫీ వల్ల తాను ఎలా ఇబ్బందుల పడుతున్నది మీడియాకు వివరించారు. 2014లో రూ.60 వేలు ఉన్న తమ రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తానని చెప్పి చేయలేదన్నారు. ఇప్పడు అది కాస్త రూ.1.65 లక్షలకు చేరిందని వివరించారు. ఇటీవల తాను పండించిన ధాన్యం డబ్బులు అదే బ్యాంకులో పడ్డాయని తెలిపారు. పాత రుణాన్ని చెల్లిస్తే గాని వడ్ల పైసలు ఇవ్వమని బ్యాంకు అధికారులు తన అకౌంట్‌ను హోల్డ్‌ లో పెట్టారని గోడు వెళ్లబోసుకున్నాడు. కేసీఆర్‌‌ ప్రభుత్వం వెంటనే రుణ మాఫీ చేయాలని కోరారు.