ఈ ఒక్కసారికి నేనే నిలబడతా..!

ఈ ఒక్కసారికి నేనే నిలబడతా..!
  • మీ ఆశీర్వాద బలంతో మళ్లీ గెలుస్తా..!!
  • మూడోసారి కేసీఆర్ సియం కావాలంటే ఇక్కడ నన్ను గెలిపించాలి.. 
  • ఆత్మీయ సమ్మేళనంలో డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్.. 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: డోర్నకల్ నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తానే ఎమ్మెల్యేగా నిలబడతానని.. మీ అభిమానంతో విజయం సాధిస్తానని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ..  ఉగ్గంపల్లితండాలో జన్మించిన తాను మీ అందరి అభిమానంతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని, వచ్చేసారి ఒక్కసారి మాత్రమే మళ్ళీ పోటీ చేస్తానని తెలిపారు. భారాస ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయసమ్మేళన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీకార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ.. చిన్నగూడూరు మండలాన్ని తానే సాధించానని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి మండలం తీసుకువచ్చానని గుర్తు చేశారు. చిన్నగూడురు మండలం రావడంతో ఈ ప్రాంతం అంత అభివృద్ధి చెందుతుందన్నారు.

ఎన్టీ రామారావు ప్రభంజనంలో సైతం డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించారని, కేసిఆర్ హవాలోను తనకు విజయాన్ని అందించారని, మీపై విశ్వాసంతోనే వచ్చేసారి మళ్లీ నేనే ఎన్నికల బరిలో దిగుతానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే, తనను డోర్నకల్ ఎమ్మెల్యేగా మీరు గెలిపించాలని, తాను వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటు వేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా మొదటిసారి విజయం సాధించినప్పుడు నియోజకవర్గంలో ఒక్క తారు రోడ్డు కూడా లేదని ఇప్పుడు 99% తారురోడ్లను నియోజకవర్గంలో వేయించడం జరిగిందన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో కనిపిస్తున్న ప్రతి అభివృద్ధి తాను సాధించిందేనని, అదంతా మీఅభిమానంతో, ఆశీర్వాదంతోనే సాధ్యమైందన్నారు.

డోర్నకల్ నియోజకవర్గ ప్రజలే నా బలం.. బలగం అని మీ ఆశీస్సులతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించి తీరుతానని రెడ్యానాయక్ తెలిపారు. ఈ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని రెడ్యానాయక్ ప్రకటించడం ద్వారా ఎవరు పోటీ చేస్తారో అనే చర్చకు తెరదించారని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మహబూబాబాద్ ఎంపీ భారాస జిల్లాఅధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ మీఅందరి అభిమానం, ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని, వచ్చే ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయాన్ని సాధించాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. భారాస నియోజకవర్గ నాయకులు డిఎస్ రవిచంద్ర తోపాటు చిన్నగూడూరు మండల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు ఈ..సమ్మేళనంలో ప్రసంగించారు.