220 సినిమాల్లో నటించిన ఆరడుగుల అందగాడు

220 సినిమాల్లో నటించిన ఆరడుగుల అందగాడు

సీనియర్ సినీ నటుడు శరత్ బాబు సుమారు 220 సినిమాల్లో నటించారు. ఆయన హైదరాబాద్​లోని ఏఐజీ హాస్పిటల్ లో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు రెండు మాసాలుగా అనారోగ్యంతో బెంగుళూరు, ఆ తర్వాత హైదరాబాద్ చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు మృత్యువుతో పోరాడి చివరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మృతిచెందారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. 1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించారు. మొదట్లో పోలీసు ఆఫీసర్​ కావాలనుకున్నారు. కంటిచూపు దెబ్బతినడంతో పోలీసు ఆఫీసర్​ కాలేకపోయారు. ఆయన సినిమాల్లోకి వెళ్లడాన్ని తండ్రి వ్యతిరేకించినా తల్లి సమర్థించారు. 1973 లో రామరాజ్యం సినిమాలో హీరోగా పరిచయమై వచ్చిన శరత్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా అనే సినిమాల్లో నటించారు. ‘పట్టిన ప్రవేశం’ సినిమాతో తమిళంలో అడుగుపెట్టారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

బెస్ట్​ సపోర్టింగ్​ యాక్టర్​గా 8 నంది పురస్కారాలు అందుకున్నారు. తమిళనాడు నుంచి ఒక స్టేట్​ అవార్డు సాధించారు. సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజనం సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి. నటి రమాప్రభతో 1974లో వివాహం జరిగింది. 1978లో వారు విడాకులు తీసుకున్నారు. 1990లో స్నేహ నంబియార్​తో వివాహం జరిగింది.  ఆయన నటించిన సినిమాలు అనేకం విజయవంతమయ్యాయి. సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమ కింకరుడు, అమరజీవి ఇలా అనేక సినిమాల్లో నటించారు. ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో నటించారు. శరత్ బాబు కుటుంబంలో ఆయన మృతి విషాదాన్ని నింపింది. శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి ఆమదాలవలసకు 1950 ప్రాంతంలో తరలివచ్చింది. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు. సత్యన్నారాయణ దీక్షితులుగా పిలుచుకునే శరత్ బాబును ఆయన కుటుంబకులు సత్యం బాబుగా పిలుస్తారు. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు పొందిన శరత్ బాబు మృతి చెందడం ఆముదాలవలస లో విషాదఛాయలు అలుముకున్నాయి.