యథేచ్ఛగా పాల కల్తీ!

యథేచ్ఛగా పాల కల్తీ!
  • కెమికల్స్ తో కృత్రిమ పాలు తయారు చేస్తున్న అక్రమార్కులు
  • హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రో క్లోరిక్ యాసిడ్ తో తయారీ
  • చిక్కదనం, ఎక్కువ రోజుల నిల్వ కోసం యూరియా వాడకం
  • ఆరోగ్యంపై తీవ్ర దుష్ఫ్రభావం చూపుతాయన్న డాక్టర్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కల్తీ పాల దందా జోరుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు కెమికల్స్ తో విచ్చల విడిగా కృత్రిమ పాల తయారు చేస్తున్నారు. అధికారులు అడపాదడపా దాడులు చేసినా కల్తీని మాత్రం పూర్తిగా నివారించలేకపోతున్నారు. ఒక్క పాడి గేదె, ఆవు లేకుండానే పాల సేకరణ పేరుతో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. వందల లీటర్ల పాలను వేల లీటర్లుగా మారుస్తూ.. పాలలో నీళ్లు పోసి, చిక్కదనం కోసం పౌడర్ కలుపుతున్నారు. మరికొందరు చుక్క పాలు లేకుండానే కెమికల్స్​తో పాలు తయారు చేస్తున్నారు. నీటిలో మిల్క్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రో క్లోరిక్ యాసిడ్, ఆక్సిటోసిన్ ఇంజక్షన్ బాటిల్, యూరియా, స్టార్చ్, బేకింగ్ సోడా, వంట నూనె కలిపి పాలను సృష్టిస్తున్నారు. అచ్చం పాలలాగే తెల్లగా, చిక్కగా, ఫ్యాట్​ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు సైతం గుర్తించలేకపోతున్నారు. ఈ కెమికల్​పాలు.. ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా విరిగిపోవు. డెడ్​బాడీలను భద్రపరచడానికి వినియోగించే ఫార్మల్​డిహైడ్​కెమికల్​ను కూడా పాలలో ఉపయోస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫుడ్​సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పాలల్లో నీళ్లు కలపడమే నేరం. అయితే కొందరు వ్యాపారులు ఏకంగా పలు రకాల కెమికల్స్​వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

భారీగా వినియోగం..

రాష్ట్రంలో పాల వినియోగం భారీగా పెరగడంతో అక్రమ వ్యాపారులు ఇష్టానుసారంగా కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర సామగ్రిని వినియోగిస్తున్నారు. డెయిరీఫామ్ లలో గేదెలకు, ఆవులకు హానికర మైన ఇంజక్షన్లు ఇస్తూ ఎక్కువ పాలు ఇచ్చేలా చేస్తున్నారు. మరోవైపు కొందరు వ్యాపారులు రహస్య ప్రదేశాల్లో హానికరమైన రసాయన పదార్థాలతో పాలు తయారు చేసిన మార్కెట్లోకి వదులుతున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో రోజూ సరాసరిగా 60 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ వినియోగం మాత్రం దాదాపు రెండింతలుగా ఉంది.

పలు జిల్లాల్లో కల్తీ పాల తయారీ..

రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో తరుచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కల్తీ పాలను తయారుచేసి హెరిటేజ్ అమూల్ లాంటి బ్రాండ్ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారు. దీంతో పోలీసులు గుర్తించి దాడులు చేయగా కల్తీ పాలలో ప్రాణాంతకమైన రసాయనాలను కలిపినట్లుగా తేలింది. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాల దందా మరోసారి వెలుగుచూసింది. కొన్నాళ్ల క్రితం చౌటుప్పల్లోని ప్రముఖ మిల్క్ డెయిరీలో పాలు, పాల పదార్థాలకు సంబంధించి ఐదు రకాల శాంపిల్స్ ఇటీవల సేకరించి టెస్ట్ చేయగా.. టోన్డ్​మిల్క్​లో కల్తీ ఆనవాళ్లు బయటపడ్డాయి. అలాగే బీబీనగర్ మండలం కొండమడుగులో ఓ ప్రైవేట్​పాల సేకరణ సెంటర్లో డైలీ రైతుల నుంచి 600 లీటర్లు వస్తుంటాయి. అయితే ఆ సెంటర్​నుంచి వెళ్లే పాలలో శవాలను భద్రపరచడానికి ఉపయోగించే ‘ఫార్మల్ డిహైడ్’ను ఉపయోగిస్తున్నారనే విషయం బయటపడింది. యూరియా, డిటర్జెంట్ పౌడర్, బేకింగ్ సోడా, రిఫైండ్ ఆయిల్, కొన్ని రకాల కెమికల్స్ తో కల్తీ పాలను తయారు చేస్తున్నారు. 

చిక్కదనం కోసం

పాలలో చిక్కదనం కోసం యూరియా, సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి వాటిని అక్రమార్కులు వాడుతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన పవిత్ర డెయిరీ విషయానికి వస్తే అక్కడ కల్తీ పాలు పెరుగు తయారీ కోసం డిటర్జెంట్, స్టార్చ్, యూరియా వాడినట్లు తెలుస్తోంది. అలాగే గంటల వ్యవధిలోనే  రసాయనాలతో గడ్డ పెరుగు తయారు చేసి అమ్ముతున్నారు. కేవలం డైరీల లో మాత్రమే కాకుండా పల్లెటూర్ల నుండి వస్తున్న పాలలో కూడా చిక్కదనం కోసం యూరియా, వెన్న శాతం కోసం పామ్ ఆయిల్ కలుపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..

కల్తీ పాల వల్ల చిన్నపిల్లలతోపాటు పెద్ద వారిరు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. వీటిలో కలిపే యూరియా, కెమికల్స్‌, వంటనూనె వల్ల వాంతులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్‌, గ్యాస్‌, జీర్ణకోశ, సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. హైడ్రోజన్‌ ఫెరాక్సైడ్‌, ఫార్మాల్డిహైడ్‌, సుక్రోజ్‌, నూనె, యూరియా, సర్ఫ్‌, బేకింగ్‌ సోడా, యూరియా, పాల పొడి లాంటి రసాయన పదార్థాలను వినియోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. అయితే కల్తీ పాలను దీర్ఘకాలంగా తాగడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్‌, కాలేయం, మెదడు సంబంధిత వ్యాధులతో పాటు ఇతర దుష్ప్రరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు పేరొంటున్నారు. అలాగే స్త్రీలలో రుతు ప్రవాహం, కంటి నష్టం, కిడ్నీ వ్యాధులు, జ్ఞాపకశక్తి లోపం కనిపిస్తాయి. కల్తీ పాల వ్యాపారులపై పలుమార్లు అధికారులు దాడులు చేస్తున్నా వారిపై పెట్టిన కేసులు అంతగా నిలబడడం లేదు.  కేసుల నుంచి చాలా సులువుగా వారు బయటపడుతున్నారు. కఠిన చట్టాలు లేకపోవడంతో చిన్న శిక్షలతోనే అక్రమార్కులు తప్పించుకుంటున్నారు.