పారిశుద్ధ్య నిర్వహణలో  సిద్దిపేటకు అవార్డు

పారిశుద్ధ్య నిర్వహణలో  సిద్దిపేటకు అవార్డు
  • కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న చైర్ పర్సన్
  • ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలికి ప్రశంస
  • 'స్వచ్ఛబడి' నిర్వాహక కౌన్సిలర్ కు సన్మానం

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జరిగిన పట్టణ ప్రగతి లో వేడుకలలో సిద్దిపేట మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులందించింది. రాష్ట్రంలోని మునిసిపాలిటీలకు వివిధ కేటగిరీల కింద ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దాంట్లో సాలీడు వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ సానిటేషన్ విభాగంలో సిద్దిపేట మున్సిపాలిటీకి మొదటి అవార్డు వచ్చింది. పట్టణ ప్రగతిలో తెలంగాణ ఉత్తమ సేవా పత్రాన్ని ఇచ్చింది. లక్షకు పైగా జనాభా ఉన్న మునిసిపాలిటీల కేటగిరిలో సిద్దిపేటకు ఈ అవార్డు వచ్చింది. శుక్రవారం రాత్రి హైదరాబాదులోని శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబరాలలో రాష్ట్ర ఐటి,పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ఈ అవార్డును, ప్రశంసా పత్రాన్ని సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు అందుకున్నారు.

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిద్దిపేట 39 వార్డులో స్వచ్ఛ బడిని నిర్వహిస్తున్న కౌన్సిలర్  గోపాలపురం దీప్తి నాగరాజు కూడా మంత్రి కేటీఆర్ మెచ్చుకొని ఇదే వేదికపై శాలువాతో సన్మానించారు. పట్టణ ప్రగతి సంబరాలలోనే పబ్లిక్ హెల్త్ వర్కర్ విభాగంలో సిద్దిపేట మున్సిపల్ లో విధులు నిర్వర్తించే బండి బాలవ్వ ను ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలిగా ఎంపిక చేసి ప్రశంస పత్రంతోపాటు 5000 రూపాయల నగదు బహుమతిని మంత్రి చేతుల మీదుగా అందజేశారు.