సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది..  వైష్ణవీ చైతన్య

సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది..  వైష్ణవీ చైతన్య

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది.  ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర హీరోయిన్ వైష్ణవీ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలేంటంటే.. నా పేరు వైష్ణవీ చైతన్య. యూట్యూబర్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్‌గా కొందరికి తెలుసు. బేబీ అనేది హీరోయిన్‌గా నా మొదటి సినిమా. సాయి రాజేష్ గారు నాకు హీరోయిన్‌గా అవకాశాన్ని ఇచ్చారు. హీరోయిన్ అవ్వాలనే కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటికి నా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని అనుకోలేదు. ఈ పాత్ర వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కథ విని షాక్ అయ్యాను. నాకు ఓ మంచి అవకాశం లభించిందని అనుకున్నాను. ఈ పాత్రను పోషిస్తానా? లేదా? అని నా మీద నాకు నమ్మకం లేనప్పుడు సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నా జీవితానికి ఇది చాలా గొప్ప, పెద్ద అవకాశం. ప్రతీ యాక్టర్‌ అంతిమ లక్ష్యం సినిమానే. ఇన్ స్టాలో వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేస్తే సినిమా హీరోయిన్ అవుతుందా? అని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఈ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా నా చుట్టూ వాళ్లు నెగెటివ్ కామెంట్లు చేశారు. అది నా మీద చాలానే ప్రభావం చూపించింది. నేను యూట్యూబ్ వరకేనా? అని అనిపించింది. కానీ సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నాలో ధైర్యాన్ని నింపారు. బేబీ సినిమాలో నాది ఓ బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయి. బస్తీ నుంచి బయటకు వచ్చిన ఆ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. కాలేజ్‌కు వచ్చాక మరో అబ్బాయి లైఫ్‌లోకి వస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా ప్రభావితం అయింది అనేది చక్కగా చూపించారు.