డెసిషన్​పెండింగ్!

డెసిషన్​పెండింగ్!
  • గవర్నర్​దగ్గరే ఎమ్మెల్సీ ఫైల్​
  • కేబినెట్​తీర్మానం చేసి 17 రోజులు
  • అభ్యంతరాలు లేవు.. రిప్లై రాలేదు
  • గతంలో కౌశిక్​రెడ్డి వ్యహారంలోనూ ఇదే తీరు!
  • ఈసారి అర్హులను ఎంపిక చేశామన్న కేబినెట్​
  • ఉన్నత విద్యావంతుడు, సామాజిక ఉద్యమ నేతగా దాసోజు
  • ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యనారాయణ
  • రాజ్​భవన్​ఎట్​హోంకు సీఎం, మంత్రులు గైర్హాజరు
  • ఇంకా పెండింగ్​లో 12 బిల్లులు

సర్కారుకు సహన పరీక్ష మొదలైంది. కేబినెట్​తీర్మానాలను మరోసారి గవర్నర్​పెండింగ్​లో పెట్టారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఫైల్​ను ఆమోదిస్తారా.. లేక మళ్లీ రిజెక్ట్​చేస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి. గవర్నర్​ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను ఎంపిక చేసిన కేబినెట్.. గతనెల 31నాడే రాజ్​భవన్​కు ఫైల్​పంపించారు. ఎమ్మెల్సీల ఎంపికతోపాటు కేబినెట్​సమావేశం, అసెంబ్లీ తీర్మానాలను కలిపి మరో 12 బిల్లులు గవర్నర్​దగ్గర పెండింగ్​పడ్డాయి. అయితే, బిల్లుల విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు ఎమ్మెల్సీల ఎంపిక మాత్రం ఆందోళనలను రేకెత్తిస్తున్నది. 

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాజ్ భవన్, ప్రగతి భవన్​మధ్య దూరం పెరుగుతోంది. ఇద్దరు ఎమ్మెల్సీల ఫైల్​ను గవర్నర్​ఇప్పటికీ ఆమోదించకపోవడంతో ప్రభుత్వం, గవర్నర్​మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ రెడ్డి అంశంలో కూడా గవర్నర్​ఇలాగే పెండింగ్​లో పెట్టి, అభ్యంతరాలను నమోదు చేసి రిజెక్ట్​ చేశారు. వాటికి సమాధానం చెప్పలేక.. ప్రభుత్వమే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నది. కానీ ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న కేసీఆర్​కేబినెట్.. అటు సామాజిక కోణంలో, ఇటు రాజకీయ కోణంలో ఎంపిక చేసింది. ఉన్నత విద్యావంతుడు, ఉద్యమకారుడు, ప్రొఫెసర్​గా పని చేసిన అనుభవం, పలు అంశాలపై సుదీర్ఘ విశ్లేషణలు చేసిన దాసోజు శ్రవణ్ తోపాటుగా ఎస్టీ (ఎరుకల) సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పేర్లను గవర్నర్​కు ప్రతిపాదించారు. కానీ ఈ ఫైల్​ఇంకా రాజ్​భవన్​గేటు దాటి బయటకు రాలేదు. 

  • ఎట్​హోం బాయ్​కాట్..

ఇటీవల కొంత సయోధ్య కుదిరిందనే ప్రచారం జరిగినా.. మళ్లీ వ్యవహారం మొదటికొచ్చింది. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా రాజ్​భవన్​ఎట్​హోంను కేసీఆర్​తరుపున బాయ్​కాట్​చేసినట్టేనని తేలిపోయింది. సీఎం కేసీఆర్​సహా మంత్రులెవ్వరూ రాజ్​భవన్​ వైపు వెళ్లలేదు. ప్రొటోకాల్​ప్రకారం కొంతమంది అధికారులు మాత్రం హాజరయ్యారు. ఇప్పటికే పలు బిల్లుల విషయంలో ఇటు సీఎం, అటు గవర్నర్​మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆర్టీసీ బిల్లు అంశంలో దుమారం రేపింది. ఒక విధంగా అధికార పార్టీ వెనకుండి రాజ్​భవన్​ముట్టడిని ముందుకు నడిపించింది. గవర్నర్​చేసిన సిఫారుసుల సవరణల తర్వాత ఎట్టకేలకు ఫైల్​ను ఆమోదించారు. దీన్ని రాజకీయంగా సైతం బీఆర్ఎస్​అందిపుచ్చుకున్నది. ఇలాంటి సమయంలో ఎట్​హోంకు సీఎం వెళ్లడం అనుమానమే అని భావించగా.. అది నిజమని తేలిపోయింది. 

  • ఎమ్మెల్సీ ఎలా..?

గవర్నర్​కోటా ఎమ్మెల్సీల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. గవర్నర్‌ ఆమోదిస్తారా లేదా ఈ విషయంలో గవర్నర్​తమిళిసై వైఖరి ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. కేబినెట్ తీర్మానం చేసిన పంపిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎంపికలో గవర్నర్ వారి నియామకానికి ఆమోదం తెలుపుతారా, లేక పాత సీన్‌ను రిపీట్ చేస్తారా అనే అంశంలో గవర్నర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల దృష్టి నెలకొన్నది. ఎమ్మెల్సీల ఎంపిక అంశం ఇప్పుడు పొలిటికల్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై చర్చించిన కేబినెట్‌.. బీసీ కోటా నుంచి హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ను, ఎస్టీ సామాజిక వర్గం నుంచి కుర్రా సత్యనారాయణను ఎంపిక చేసింది. కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఫైలును గవర్నర్ వద్దకు పంపారు. కానీ, గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలుపుతూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన ఇద్దరు నేతలతోపాటుగా అధికార పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయగా తమిళిసై ఆమోదం తెలుపలేదు. కౌశిక్ రెడ్డిపై కేసులు ఉన్నాయనే ఫిర్యాదులు వచ్చాయని, దీంతో ఎంపిక ఫైల్ పెండింగ్​లో పెట్టినట్లు గవర్నర్ తరుపున రాజ్​భవన్​నుంచి ప్రగతిభవన్​కు సమాచారం పంపించారు. దీంతో రాజ్‌భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. చివరికి కేసీఆర్‌ ఈ ఎంపికను మార్చుకున్నారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి గవర్నర్ కోటాలో మధుసూదనాచారికి అవకాశం కల్పించింది. తాజాగా ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్​అయినట్టేగానే కనిపిస్తున్నది. 

  • ఎంపికలోనూ ఆచీతూచి..!

గవర్నర్​కోటా ఎమ్మెల్సీల విషయంలో కేబినెట్ కొంత ఆచితూచి ఎంపిక చేసింది. దాసోజు శ్రవణ్​ను ఎంపిక చేయడంలో సామాజిక కోణంతో పాటుగా ఉద్యమనేత, సోషల్​యాక్టివిటీ, విద్యార్హతలను పరిగణలోకి తీసుకున్నది. ఎంఏ, ఎల్ఎల్ బీ, ఎంబీఏ, పీహెచ్ డీ చేసిన శ్రవణ్​విద్యార్థి నేతగా, రీసెర్చ్ స్కాలర్ గా, తెలంగాణ ఉద్యమంలో శ్రీ కృష్ణ కమిటీకి నివేదికలు ఇవ్వడం, పలుపార్టీలకు ఎన్నికల మేనిఫెస్టోలు తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఓబీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు. విజన్​ తెలంగాణపై ఇండియా సీఈఓ ఫోరంలో నివేదిక ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ తరుపున మిలియన్​ మార్చ్​, సాగర హారం, చలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె, సడక్​ బంద్​, సంసద్​యాత్ర వంటి కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి కోసం పలు పథకాలు అమలు చేయడం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గ్రామీణుల జీవన విధానంపై అధ్యయనం చేశారు. పలు సంస్థల తరుపున సామాజిక కార్యక్రమాలను సైతం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇక, మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యానారాయణను ఎస్టీ కోటా నుంచి ఎంపిక చేశారు. వెనకబడిన ఎరుకలి సామాజిక వర్గం నుంచి ఆయనకు అవకాశం కల్పిస్తున్నట్లు కేబినెట్​ ప్రకటించింది. ఎస్టీ వర్గాల కోసం సత్యనారాయణకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినట్లు కేబినెట్​ వెల్లడించింది. 

  • వివాదం కంటిన్యూ..

బీఆర్ఎస్​ గా రూపాంతరానికి ముందు టీఆర్ఎస్​ పార్టీ బీజేపీతో వైరానికి దిగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందంటూ రాష్ట్ర అధికార పార్టీ ఏకంగా నిరసనలకు దిగింది. ఇలాంటి సమయంలో పాడి కౌశిక్​రెడ్డి వ్యవహారం స్థానికంగా రాజ్​భవన్, ప్రగతి భవన్​ మధ్య విభేదాలకు అగ్గి పెట్టింది. దీంతో అప్పటి నుంచి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదం ఇంకా కొనసాగుతోంది. గతంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని గవర్నర్.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును ఆశ్రయించింది. 

  • బిల్లులు ఆమోదిస్తారా?

బిల్లుల్ని పెండింగ్ లో పెట్టి ప్రభుత్వ సహనాన్ని పరీక్షించడం మళ్లీ మొదలైంది. తాజాగా వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీ, మండలి ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై ఆమోదముద్ర వేయకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. వీటిని ఆమోదిస్తే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి చట్టరూపంలోకి తీసుకు రావాల్సి ఉంటుంది. చట్టసభలు ఆమోదించినా వాటికి గవర్నర్ రాజముద్ర పడకపోవడం విశేషం. గతంలో గవర్నర్ తమిళిసై 3 బిల్లుల్ని తిప్పి పంపగా, ఒక బిల్లుని తిరస్కరించారు. ఆ నాలుగు బిల్లుల్ని మరోసారి అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ వద్దకు పంపించారు. తెలంగాణ మున్సిపల్‌ బిల్లు–2022,  తెలంగాణ ప్రైవేటు వర్సిటీల బిల్లు–2022, రాష్ట్ర పంచాయతీరాజ్‌ బిల్లు–2023,  తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ బిల్లు–2022  బిల్లులను రెండోసారి సభ ఆమోదం తెలిపి రాజ్ భవన్ కి పంపించింది. కొత్తగా తెలంగాణ పంచాయతీరాజ్‌ (రెండో సవరణ) బిల్లు–2023, తెలంగాణ పంచాయతీరాజ్‌ (మూడో సవరణ) బిల్లు - 2023, తెలంగాణ మున్సిపాల్టీల (రెండో సవరణ) బిల్లు -2023,  తెలంగాణ జీఎస్టీ చట్ట సవరణ బిల్లు -2023, తెలంగాణ స్టేట్‌ మైనారిటీస్‌ కమిషన్‌ బిల్లు -2023, ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు -2023, టిమ్స్‌ వైద్య సంస్థల బిల్లు -2023, తెలంగాణ ఆర్టీసీ బిల్లు–2023 బిల్లులను పంపించారు. వీటిలో ఆర్టీసీ బిల్లు సభ ఆమోదానికి ముందే వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు సభ ఆమోదం తెలిపిన తర్వాత కూడా వీటికి మోక్షం కలగడం లేదు. దాడాపు వారం రోజులుగా ఈ బిల్లులు రాజ్ భవన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉండటంతో ఆలోగానే బిల్లులను అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.