కుదరని సఖ్యత

కుదరని సఖ్యత
  • కాంగ్రెస్ ను వీడని కలహాలు
  • ఠాక్రే మీటింగ్ కు నేతలు  గైర్హాజరు
  • 34 మంది వీపీలలో 9 మందే హాజరు
  • నోటీసులు జారీ చేయాలని ఆదేశం
  • కోమటిరెడ్డి పార్టీ లైన్ లో ఉన్నారని వ్యాఖ్య

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్​ నేతలపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్​ మాణిక్​రావు ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులతో గాంధీభవన్ లో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్​కు రావాలని 34 మందికి ఆహ్వానం పంపగా, 9 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో  ఠాక్రే సీరియస్​ అయ్యారు. ఎందుకు గైర్హాజరయ్యారో వివరణ అడుగాలని, నోటీసులు జారీ చేయాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్​ ఏలేటి మహేశ్వర్​ రెడ్డికి సూచించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మరోసారి మీటింగ్​ నిర్వహిస్తున్నట్లు ఠాక్రే వెల్లడించారు. ఇదే సమావేశంలో కొంతమంది పీసీసీ ఉపాధ్యక్షులు ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించేందుకు ప్రయత్నించగా.. తర్వాత మాట్లాడుతామంటూ సర్ధి చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి పార్టీ లైన్​ లోనే ఉన్నారని, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారని అన్నారు. రాహుల్ గాంధీ మాటలకు ఎంపీ వెంకట్ రెడ్డి కట్టుబడి ఉన్నారని, కాంగ్రెస్​ నాయకులంతా ఐక్యంగా ఉన్నారని, త్వరలోనే పాదయాత్ర చేస్తారని వెల్లడించారు. పనితీరు బాగాలేని వారిని మార్చుతామన్నారు.

దుమారం లేపుతున్న హంగ్​ వ్యాఖ్యలు
కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సోమవారం చేసిన ‘హంగ్​’ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. పార్టీ బలపడుతున్న సమయంలోనే పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని, అలాంటి వారిని క్షమించవద్దని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. మునుగోడు ఎన్నికలోనూ తన తమ్ముడు రాజగోపాల్​రెడ్డికి ఓటు వేయాలంటూ ప్రచారం చేశారని మండి పడుతున్నాయి. గతంలోనే పార్టీకి నష్టం కలిగే విధంగా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు పార్టీకి నష్టం జరిగేది కాదని అభిప్రాయపడుతున్నారు. కోమటిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, మహబూబ్​నగర్​, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు డిమాండ్​ చేశారు.


వివరణ ఇచ్చుకున్న కోమటిరెడ్డి
వెంకటరెడ్డి  చేసిన కామెంట్స్‌ ను హై కమాండ్  సీరియస్​గా తీసుకుంది. తనను కలవాలని కోమటిరెడ్డిని మాణిక్ రావు థాక్రే  ఆదేశించారు. దీంతో బుధవారం ఉదయం థాక్రేతో వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు.  కామెంట్స్‌ను థాక్రే వీడియో క్లిప్పింగ్ చూశారు. కోమటిరెడ్డి మాటలను ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేయించుకున్నారు. కోమటిరెడ్డి వివరణ తర్వాత థాక్రే ఏఐసీసీ కి రిపోర్టు ఇవ్వనున్నారు. ఠాక్రేతో భేటీ అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిన్నటి తన వ్యాఖ్యలపై చర్చ జరగలేదన్నారు. మీడియాలో తన వ్యాఖ్యలు తప్పుగా ప్రచారం చేశారన్నారు.