ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు

ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు
  • టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరిక
  • ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందన
  • సమస్యలు వింటూ, హామీలు ఇస్తూ ముందుకు 
  • జనగామ జిల్లాకు చేరిన ‘హాత్‌ సే హాత్‌ జోడో’ పాదయాత్ర
  • రూ.500కు సిలిండర్ ఇస్తామని హామీ

 
ముద్ర ప్రతినిధి, జనగామ:  పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడినా ఉపేక్షించబోమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారిపై హైకమాండ్‌ తో చర్చలు జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికలలో బీఆర్‌‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌‌ఎస్‌ కలుస్తాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌ నిర్వహిస్తున్న హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తొమ్మిదవ రోజు మంగళవారం ఆయన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానికులను ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. దేవరుప్పులలో కొండయ్య అనే రైతు ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పాలకుర్తిలో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. అనంతరం పత్తి చేనులో పనిచేస్తున్న తోటకూరి సోమలింగమ్మ అనే కూలీతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధర్మపురంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌ రూం ఇళ్లను పరిశీలించారు. ఊరికి దూరంగా నిర్మించిన ఇండ్లలో పిచ్చి మొక్కలు మొలిచి నిరుపయోగంగా మారాయని, అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా తయారయ్యాయని స్థానికులు రేవంత్‌ రెడ్డి వివరించారు.  యాత్రలో  మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బంజారాలతో కలిసి చిందేసి
ధర్మపురంలో నిర్వహించిన సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలలో  రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారాలతో కలిసి డ్యాన్స్‌ చేశారు. భోజన విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన రేవంత్‌ రెడ్డి యాత్ర విస్నూరు నుంచి కాపులగడ్డ తండా మీదుగా పాలకుర్తి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు సాగింది. పాలకుర్తి రాజీవ్ గాంధీ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. పాదయాత్రగా దేవరుప్పులకు చేరుకున్న రేవంత్‌రెడ్డికి జనగామ డీసీసీ ప్రెసిడెంట్‌ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్‌ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొమ్మటి సాంబయ్య, మాజీ జడ్పీ చైర్‌‌ పర్సన్‌ ధన్వంతి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, జిల్లా నాయకుడు అల్లం ప్రదీప్‌రెడ్డి తదితరులు ఘన స్వాతగం పలికారు. 

రూ.500కే సిలిండర్ 
తాము అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఒక్క ఏడాదిలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ రూ.5 లక్షలకు పెంచి పేదలకు వైద్యం అందిస్తామన్నారు.  పాలకుర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పోటీ చేయాలని జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి కోరారు. లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందుతాడాని పేర్కొన్నారు. 

ఎర్రబెల్లి  కేసీఆర్ ను కూడా  మోసం చేస్తాడు
‘ఎర్రబెల్లి  ఏదో ఒక రోజు కేసీఆర్ ను కూడా  మోసం చేస్తాడు.  కేసీఆర్ నిద్రపోతే ఆయనకు తెలియకుండానే  కిడ్నీలు అమ్ముకునే తత్వం. బమ్మెర పోతన పుట్టిన చారిత్రక పాలకుర్తి గడ్డని.. ఓనమాలు రాని ఎర్రబెల్లి  ఏలుతున్నాడు’  అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పాలకుర్తి రాజీవ్ చౌక్  సెంటర్లో నిర్వహించిన  స్ట్రీట్ కార్నర్ మీటింగులో  రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ‘పాదయాత్రలో భాగంగా పీజీ చదివిన వికలాంగ నిరుద్యోగ యువకుడు నాగరాజును కలిశాను’ అతని కష్టాలను చూసి నాకూ దుఃఖం వచ్చింది. వచ్చిన తెలంగాణ ఏవడి పాలైందో ఆలోచించండి. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. బమ్మెర పోతన పుట్టిన గడ్డ ఇది. దొరలు, గడీలపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఆడబిడ్డ చాకలి ఐలమ్మ గడ్డ ఇది. ఈ పోరాటాల పురిటిగడ్డలో పలక బలపం ఇచ్చినా ఏబీసీడీలు రాయలేనివాడు ఎమ్మెల్యే అయ్యాడు’ అని  రేవంత్ విమర్శించారు.  కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. 

కరెంటు  తీగలు పట్టుకునేందుకు  రెడీ
రాష్ట్రంలో వ్యవసాయానికి 24గంటల కరెంటు అందడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్ తీగలు పట్టుకునేందుకు తాము రేడీగా ఉన్నామని,  దమ్ముంటే జగదీష్ రెడ్డి తన సవాల్ స్వీకరించాలన్నారు. మంత్రి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ నేతలు చార్జీషీట్ విడుదల చేశారు. ఒకప్పుడు రేషన్ డీలర్ గా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు ఇప్పుడు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ప్రశ్నించారు. దయాకరరావు ఏ పని చేసినా 30శాతం కమీషన్ తీసుకుంటారని ఆరోపించారు.  రేవంత్ రెడ్డి పాదయాత్రలో  పాల్గొనేందుకు రైతులు ఎడ్ల బండ్లతో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వస్తే పోలీసులతో అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.